గుడివాడ పురపాలక భవనానికి కఠారి సత్యనారాయణ పేరు ... నేమ్ బోర్డు ఆవిష్కరించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
గుడివాడ మేజర్ న్యూస్ : గుడివాడ పురపాలక సంఘ కార్యాలయ భవనానికి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కఠారి సత్యనారాయణ పేరు పెడుతూ ఏర్పాటు చేసిన నూతన నామఫలకాన్ని మంగళవారం ఆవిష్కరించారు. కఠారి సత్యనారాయణ కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన అనుచరుడు, సన్నిహితుడు జాజుల తాతారావు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నామఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అభిమానులు ‘సర్దార్ కఠారి సత్యనారాయణ జోహార్’ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ గుడివాడ రాజకీయ చరిత్రలో కఠారి సత్యనారాయణది ప్రత్యేక అధ్యాయమని, ఉక్కు కఠారిగా, అజాతశత్రువుగా, బడుగు బలహీన వర్గాల నేతగా ఆయన సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన గొప్పతనం, ప్రజలకు చేసిన సేవలు భావితరాలకు తెలియాలనే ఉద్దేశంతోనే పురపాలక భవనానికి ఆయన పేరు పెట్టామని తెలిపారు. ఇది కేవలం నామకరణం కాదని, మహనీయుడికి గుడివాడ ప్రజల తరఫున అందిస్తున్న ఘన నివాళి అని పేర్కొన్నారు. కఠారి ఆశయాలు, నిబద్ధతను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కఠారి సత్యనారాయణ కుమారుడు రాంకుమార్ మాట్లాడుతూ తన తండ్రి పేరును మున్సిపల్ భవనానికి పెడుతూ రెండేళ్ల క్రితమే జీవో విడుదలైందని, అయితే వ్యక్తిగత కారణాలతో తన వల్లే నామకరణ కార్యక్రమం ఆలస్యమైందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలోనే నామఫలకం ఏర్పాటు చేశారంటూ వస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని, ఆలస్యానికి తన నిర్లక్ష్యమే కారణమని తెలిపారు. ఈ ఆలస్యాన్ని కఠారి అభిమానులు మన్నించాలని కోరారు. గతంలోనూ మున్సిపల్ భవనానికి తన తండ్రి పేరు పెట్టేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదని, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చొరవతో తమ చిరకాల కోరిక నెరవేరిందని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, జనసేన ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య, మండల అధ్యక్షుడు వాసే మురళి, బీజేపీ నాయకులు అంగడాల సతీష్, ఆర్కే, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కిల్లారపు రంగప్రసాద్ యాదవ్, మాజీ సంయుక్త కార్యదర్శి పర్వతనేని ఆనంద్, శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టి హరికుమార్, కఠారి కుటుంబ సభ్యులు, యాదవ సంఘం పెద్దలు, కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, గుడివాడ నియోజకవర్గం, కృష్ణాజిల్లా.