సీఎం చంద్రబాబు కి నిడదవోలు రైతుల కన్నీటి కష్టాలు వివరించిన మంత్రి దుర్గేష్
ఇన్సూరెన్స్‌తో సంబంధం లేకుండా ప్రతి రైతుకూ పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి
పెరవలి మేజర్ న్యూస్ :'మురసు', 'అర్నాబ్' తుఫాన్ల దాటికి తూర్పు గోదావరి జిల్లాతో పాటు ప్రత్యేకించి నిడదవోలు నియోజకవర్గ రైతాంగం తీవ్రంగా దెబ్బతిని ఆవేదనలో ఉందని సీఎం చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నవంబర్ 10వ తేదీ మంగళవారం అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో తూర్పు గోదావరి జిల్లాతో పాటు నిడదవోలు నియోజకవర్గంలో ప్రకృతి వైపరీత్యం సృష్టించిన బీభత్సాన్ని, రైతుల కష్టాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.ఈ సందర్భంగా తుఫాన్ల ఉధృతికి తోడు ఎర్రకాలువ పొంగిపొర్లడంతో సమీప గ్రామాలు జలమయమయ్యాయని చేతికొచ్చిన పంట పూర్తిగా నాశనమై రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని తెలిపారు. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరి ప్రజల జనజీవనం స్తంభించిపోయిందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పంట ఇన్సూరెన్స్ కొద్దిమందికే ఉన్నందున, ఇన్సూరెన్స్ లేని రైతులను కూడా మానవీయ కోణంలో పరిగణనలోకి తీసుకుని నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకూ ప్రభుత్వ పరిహారం అందించాలని విన్నవించారు..తుఫాన్ తో పాటు ఎర్రకాలువ వరద వల్ల దెబ్బతిన్న పంటలు, ఇళ్ల నష్టాన్ని తక్షణమే అంచనా వేసి (ఎన్యుమరేషన్), నిబంధనలకు అతీతంగా అర్హులైన ప్రతి రైతునూ జాబితాలో చేర్చాలని కోరారు.నిడదవోలు నియోజకవర్గ రైతాంగాన్ని, ప్రజలను అన్ని విధాలా ఆదుకుని కొండంత అండగా నిలవాలని మంత్రి దుర్గేష్ విజ్ఞప్తి చేయగా దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో సానుకూలంగా స్పందించారని మంత్రి దుర్గేష్ తెలిపారు.