8వ వేతన సంఘం: ఆటో రంగంలో భారీ వినియోగ చక్రం
సూర్య బిజినెస్ డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతన సవరణ కోసం త్వరలో రూపుదిద్దుకోనున్న 8వ వేతన సంఘం భారత ఆర్థిక వ్యవస్థలో సరికొత్త వినియోగ చక్రానికి నాంది పలకనుందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. గత మూడు దశాబ్దాలుగా అమలైన పే కమిషన్ల చరిత్రను పరిశీలిస్తే, ప్రభుత్వ ఉద్యోగుల చేతుల్లోకి చేరిన భారీ ఏరియర్లు, వేతన పెంపుదల దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని ఎలా పరుగులు పెట్టించాయో స్పష్టమవుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి డ్రైవింగ్ ఆకాంక్షలను ప్రతిబింబించే మారుతి కార్ల విక్రయాల గణాంకాలు ఈ పరిణామాన్ని మరింత విశదీకరిస్తున్నాయి.
గత రికార్డులను తిరగేస్తే, 1997లో 5వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చి వేతనాల్లో భారీ పెరుగుదల లభించినప్పుడు భారత మధ్యతరగతి ఉద్యోగ వర్గం పెద్దఎత్తున మారుతి 800 కారు కొనుగోలుకు మొగ్గు చూపింది. అంతవరకు టూ వీలర్‌కు పరిమితమైన కుటుంబాలకు మారుతి 800 ఒక సామాజిక హోదాగా, మొదటి కారుగా రూపాంతరం చెంది రికార్డు అమ్మకాలను నమోదు చేసింది. ఆ తర్వాత 2008లో 6వ వేతన సంఘం ఏరియర్లు ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో వినియోగదారుల ప్రాధాన్యతలు మరింత ప్రీమియం వైపు మళ్లాయి. ఆ తరుణంలో మారుతి జెన్, జెన్ ఎస్టీలో వంటి స్టైలిష్ హ్యాచ్‌బ్యాక్‌ల విక్రయాలు మార్కెట్లో అనూహ్యంగా పెరిగాయి.
ఇక 2016లో అమలైన 7వ వేతన సంఘం నాటికి వినియోగదారుల ఆలోచనా విధానం ప్రాక్టికల్ ఫ్యామిలీ స్పేస్ వైపు అడుగులు వేసింది. ఫలితంగా టాల్‌బాయ్ డిజైన్‌తో వచ్చిన మారుతి వ్యాగన్‌ఆర్ వంటి కార్లు మార్కెట్లో రికార్డు స్థాయి అమ్మకాలను సాధించాయి. ప్రభుత్వ ఉద్యోగుల కొనుగోలు శక్తి పెరిగిన ప్రతిసారీ దేశీయ కార్ల మార్కెట్ పరిమాణం, వినియోగదారుల అభిరుచులు ఒక స్థాయి నుంచి మరో స్థాయికి ఉన్నతీకరణ చెందడం ఒక నిరూపితమైన ఆర్థిక సూత్రంగా మారింది.
రాబోయే 8వ వేతన సంఘం అమలుతో సుమారు కోటి మందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ బలగాలు, పెన్షనర్ల చేతుల్లోకి భారీగా నగదు ప్రవాహం రానుంది. అయితే ఈసారి మార్కెట్ ట్రెండ్ చిన్న హ్యాచ్‌బ్యాక్‌లకు మాత్రమే పరిమితం కాకుండా కాంపాక్ట్ ఎస్‌యూవీలు , మైల్డ్-హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లనుందని మార్కెట్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. గతంలో మారుతి 800 నుంచి జెన్, వ్యాగన్‌ఆర్ వరకు సాగిన ఈ ప్రయాణం.. రాబోయే రోజుల్లో మిడ్-సైజ్ ఎస్‌యూవీలు, అత్యాధునిక ఫీచర్లు కలిగిన గ్రీన్ మొబిలిటీ విభాగంలో సరికొత్త వినియోగ విప్లవానికి తెరతీయనుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.