telangana
కొమురం భీం జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సుర్పం అనిత
సూర్య,కాగజ్‌నగర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నూతనంగా నియమితులైన సుర్పం అనితకు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి శ్రీమతి అదిత అభినందనలు తెలిపారు. కాగజ్ నగర్ మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన మాలిని నుంచి వచ్చిన మహిళకు జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించడం సంతోషకరమని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్ ఎప్పుడూ గుర్తిస్తుందని అన్నారు.ఈ సందర్భంగా కాగజ్ నగర్ పట్టణంలోని అదిత నివాసానికి వెళ్లిన సుర్పం అనిత ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తదితర పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.అనంతరం అనిత మాట్లాడుతూ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ నాయకత్వంలో మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. త్వరలో మండల స్థాయిలో మహిళా కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మాలిని సర్పంచ్ మాణిక్ రావు, నాయకులు ఓదేలు, నగేష్, అర్జున్, శంకర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.