అగ్నిప్రమాదంలో దెబ్బతిన్న చర్చి పునర్నిర్మాణానికి కృషి చేస్తా.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హామీ
మోమిన్ పెట్, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం వెల్‌చాల్ గ్రామంలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదానికి గురైన చర్చిని తెలంగాణ శాసనసభ సభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ శనివారం పరిశీలించారు. చర్చిలో జరిగిన అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని గ్రామ సర్పంచ్, గ్రామస్తులు ఆయనకు వివరించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న సభాపతి, చర్చి పునర్నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన సానుకూలంగా స్పందించడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామంలో సబ్‌ప్లాన్ నిధులతో రహదారుల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులకు సూచించారు. గ్రామంలో నెలకొన్న బోరుబావుల సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, స్థానిక నాయకులు, గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్: వడ్ల మాణిక్యం చారి, మోమిన్ పేట్, వికారాబాద్ జిల్లా.