గడువులోగా ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయాలి.. ఆస్తులు కోల్పోయిన వారికి వారంలో పరిహారం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: వికారాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ రోడ్డు పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని తెలంగాణ శాసనసభ సభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, నిర్మాణంలో ఎలాంటి జాప్యం జరగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు రాకపోకలు సులభతరమవుతాయని పేర్కొన్నారు. నిర్మాణ పనుల సమయంలో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి సహకరించి ఆస్తులు కోల్పోయిన బాధితులకు వారం రోజుల్లోగా నష్టపరిహారం చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు సభాపతి తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో ఆర్డీఓ వాసు చంద్ర, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ద సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్, ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.