సిండికేట్ అయ్యారా..? అనుకున్నదొక్కటి..అయినది ఒక్కటి..!?
చిట్టమూరు మేజర్ న్యూస్
చిట్టమూరు మండలంలో ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా నాలుగు ఎంపీటీసీ సెగ్మెంట్లలో ముందస్తు అంచనాలకు భిన్నంగా ఫలితాలు రావడం పలువురు నాయకుల రాజకీయ లెక్కలను తారుమారు చేసింది. అభ్యర్థుల గెలుపోటములపై ముందుగానే వ్యూహాలు, సమీకరణాలు సిద్ధం చేసుకున్నప్పటికీ తుది ఫలితాలు మరోలా రావడం వెనుక కారణాలపై విశ్లేషణలు సాగుతున్నాయి.ఎన్నికల బరిలో రాజకీయ ప్రత్యర్థులుగా కనిపించిన నాయకుల మధ్య తెరవెనుక ఏవైనా అవగాహనలు కుదిరాయా? స్థానిక స్థాయిలో అంతర్గత సహకారం,రాజకీయ సమీకరణాలు ఫలితాలను ప్రభావితం చేశాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా క్రాస్ ఓటింగ్‌కు అవకాశం లేదని ఫలితాల సరళి స్పష్టం చేస్తున్న నేపథ్యంలో నాలుగు సెగ్మెంట్లలో అంచనాలు తారుమారు కావడం మరింత చర్చనీయాంశమైంది. ఓట్ల సరళిలో క్రాస్ ఓటింగ్ కనిపించకపోయినా ఫలితాలు అనూహ్యంగా మారడానికి స్థానిక రాజకీయ పరిస్థితులే కారణమా,లేక ప్రత్యర్థి వర్గాల మధ్య తెరవెనుక పరస్పర అవగాహనలు ఉన్నాయా అన్న కోణంలో రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా ఈ పరిణామాలను రాబోయే పంచాయతీ ఎన్నికలతో ముడిపెట్టి కూడా కొందరు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఆయా గ్రామాల్లో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో తమ అభ్యర్థుల విజయానికి ప్రత్యర్థి వర్గాల మద్దతు అవసరమనే ఆలోచనతో ముందుగానే పరస్పర సహకారానికి సంబంధించిన లోపాయికారీ ఒప్పందాలు ఏమైనా కుదుర్చుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుత ఎంపీటీసీ ఎన్నికల్లో ఏర్పడిన రాజకీయ సమీకరణాలు భవిష్యత్తులో పంచాయతీ ఎన్నికల సమయంలోనూ కొనసాగుతాయన్న చర్చ మొదలైంది.ముందస్తు అంచనాలు ఎందుకు తప్పాయి.. ప్రత్యర్థులుగా కనిపించిన నాయకులు అంతర్గతంగా ఒక్కటై సిండికేట్‌గా వ్యవహరించారా? నాలుగు సెగ్మెంట్లలో ఫలితాలు తారుమారు కావడానికి ఓటర్ల స్వతంత్ర నిర్ణయమే కారణమా, లేక తెరవెనుక సాగిన రాజకీయ వ్యూహాల ప్రభావమా అనే అంశాలు ప్రస్తుతం మండల రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. రాబోయే పంచాయతీ ఎన్నికల నాటికి ఈ రాజకీయ సమీకరణాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్