సీఎం సభ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి: ఎస్పీ స్నేహ మెహ్రా
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: ఈ నెల 9వ తేదీన తుంకిమెట్ల నుంచి హకీంపేట వెళ్లే ప్రధాన రహదారిలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపు సూచనలు పాటించాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఐపీఎస్ కోరారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో తుంకిమెట్ల–హకీంపేట రహదారిపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశముందని తెలిపారు. కోస్గి నుంచి పరిగి వెళ్లే వాహనదారులు కొడంగల్ మీదుగా ప్రయాణించాలని, అదేవిధంగా పరిగి నుంచి కోస్గి వెళ్లే వాహనదారులు కూడా కొడంగల్ మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. వాహనదారులు ముందుగానే ప్రయాణాలను ప్రణాళిక చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించి ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని ఆమె కోరారు.