దీపావళి వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.. సురక్షితంగా పండుగ జరుపుకోవాలి: ఎస్పీ స్నేహ మెహ్రా
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందోత్సాహాల మధ్య ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చే సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు కాల్చాలని, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ఇళ్ల సమీపంలో బాణసంచా కాల్చకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. టపాసులు కాల్చే సమయంలో నీరు, ఇసుక వంటి వాటిని అందుబాటులో ఉంచుకోవాలని, అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఆనందాల దీపావళి ప్రమాదాలకు తావులేకుండా, అందరి జీవితాల్లో వెలుగులు నింపేలా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పిలుపునిచ్చారు.