ఎల్‌నినో ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన వికారాబాద్ డెవలప్‌మెంట్ ఫోరం
వికారాబాద్, మేజర్ న్యూస్: ఎల్‌నినో ప్రభావాలు, వాతావరణ మార్పులు, వాటి వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వికారాబాద్ డెవలప్‌మెంట్ ఫోరం (VDF) ఆధ్వర్యంలో శనివారం వికారాబాద్‌లోని వేదిక్ హైస్కూల్, జెడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌నినో అంటే ఏమిటి? దాని ప్రభావంతో వర్షపాతం, ఉష్ణోగ్రతలు, వ్యవసాయం, నీటి వనరులపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశాలను విద్యార్థులకు వివరించారు. భవిష్యత్తులో నీటి కొరత వంటి సమస్యలను అధిగమించాలంటే ఇప్పటి నుంచే నీటి పొదుపు, ప్రకృతి వనరుల సంరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టడం, నీటిని వృథా చేయకుండా వినియోగించడం, మొక్కలు నాటడం, పర్యావరణాన్ని పరిరక్షించడం వంటి చర్యల ద్వారా ప్రకృతి సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పర్యావరణ పరిరక్షణపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో పర్యావరణ బాధ్యతను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఫోరం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో VDF సభ్యులు నాగేశ్వర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, అడ్వకేట్ ఆనంద్, సాయి వర్ధన్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, శ్రీకాంత్, డాక్టర్ స్వప్న, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.