కొడంగల్‌లో నేడు సీఎం రేవంత్ రెడ్డి 2 వ రోజు పర్యటన.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం కొడంగల్ నియోజకవర్గంలో రెండో రోజు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు మండలాల్లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ భవనాలు, ప్రజా సేవా కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఉదయం 9.45 గంటలకు హకీంపేటలో స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులతో సమావేశమై వారితో ముఖాముఖి మాట్లాడనున్నారు. అనంతరం ఉదయం 10.45 గంటలకు హకీంపేటలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను ప్రారంభిస్తారు. 11 గంటలకు హకీంపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. 11.30 గంటలకు బొంరాస పేట్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాల, 11.45 గంటలకు పోలీస్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.45 గంటలకు కొడంగల్‌లో పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. 1.15 గంటలకు దుద్యాల్‌లో పోలీస్ స్టేషన్, 1.45 గంటలకు సమీకృత మండల కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.10 గంటలకు కోస్గిలో సైన్స్ మ్యూజియం, 3 గంటలకు దౌల్తాబాద్ మండలం బాలంపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సాయంత్రం 4 గంటలకు దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. పలు ప్రభుత్వ భవనాలు అందుబాటులోకి రావడంతో విద్య, వైద్యం, పోలీసు, పరిపాలనా సేవలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయి.