సైబర్‌ట్రక్ ఉత్పత్తిపై టెస్లా కీలక నిర్ణయం
సూర్య బిజినెస్ డెస్క్: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా తన ఎలక్ట్రిక్ పిక్‌అప్ ట్రక్ 'సైబర్‌ట్రక్' (Cybertruck) ఉత్పత్తికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని టెక్సాస్ గిగాఫ్యాక్టరీలో కొనసాగుతున్న సైబర్‌ట్రక్ ప్రొడక్షన్ లైన్‌ను వచ్చే ఏడాది మధ్య నాటికి పూర్తిగా నిలిపివేయాలని (డెమాలిష్ చేయాలని) కంపెనీ నిర్ణయించింది. అయితే ఆ లైన్‌ను మూసివేసేలోపు పెండింగ్‌లో ఉన్న ఆర్డర్లన్నింటినీ పూర్తి చేసేందుకు వీలుగా అదనపు ప్రొడక్షన్ షిఫ్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ప్రకటించారు. సైబర్‌ట్రక్ ఆర్డర్ బుక్ అంచనాల కంటే ఎక్కువగా ఉందని, లైన్ తొలగించేలోపు వీలైనన్ని ఎక్కువ వాహనాలను కస్టమర్లకు అందించడమే లక్ష్యంగా ఈ అదనపు షిఫ్ట్ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
టెక్సాస్ ప్లాంట్‌లోని ఈ ప్రొడక్షన్ లైన్‌ను తొలగించిన తర్వాత ఆ స్థానంలో టెస్లా తన ప్రతిష్టాత్మక 'సైబర్‌క్యాబ్' (Cybercab) రోబోటాక్సీ ఉత్పత్తిని భారీ ఎత్తున విస్తరించాలని ప్రణాళిక వేసింది. కృత్రిమ మేధస్సు (AI) మరియు రోబోటిక్స్ రంగంపై దృష్టి సారించడంలో భాగంగా టెస్లా ఈ వ్యూహాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. 2023 చివరిలో కస్టమర్ల చేతికి అందిన సైబర్‌ట్రక్, తన వినూత్న స్టెయిన్‌లెస్ స్టీల్ డిజైన్‌తో భారీగా ఆకర్షించినప్పటికీ, విక్రయాల పరంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అధిక ధరలు, వరుస రీకాల్స్ మరియు యూరప్ వంటి విదేశీ మార్కెట్లలో కఠినమైన నిబంధనల కారణంగా అమ్మనాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.
గత ఏడాది కాలంలో సైబర్‌ట్రక్ అమ్మనాలు గణనీయంగా పడిపోవడంతో టెస్లా తన భవిష్యత్ ప్రణాళికలను పూర్తిగా అటానమస్ వాహనాల వైపు మళ్లిస్తోంది. డ్రైవర్ లేని రెండు సీట్ల రోబోటాక్సీ అయిన సైబర్‌క్యాబ్ ఉత్పత్తిని పెంచేందుకు వీలుగా ఈ భారీ మార్పులు చేపడుతున్నారు. గతంలో మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ ప్రొడక్షన్ లైన్లను కూడా ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోట్ల తయారీ కోసం మార్పులు చేసిన టెస్లా, ఇప్పుడు సైబర్‌ట్రక్ స్థానంలో రోబోటాక్సీలకు ప్రాధాన్యత ఇస్తోంది. రాబోయే జూన్ లేదా జూలై నాటికి సైబర్‌ట్రక్ ప్రొడక్షన్ లైన్ పూర్తిగా కనుమరుగై, ఆ ప్రాంగణం పూర్తిగా అత్యాధునిక రోబోటాక్సీల తయారీ కేంద్రంగా మారనుంది.