రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు -- తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఏలూరు సూర్య న్యూస్, : తుఫాన్ కారణంగా జిల్లాలో రానున్న 3 రోజులపాటు భారీ నుండి అతి భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. తుఫాన్ పరిస్థితిపై ఆదివారం సాయంత్రం సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ తుఫాన్, భారీ వర్షాల కారణంగా జిల్లాలో నదులు, చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖాధికారులకు కలెక్టర్ ఆదేశించారు;. తుఫాన్ తీరం దాటే సమయంలో నదీ పరివాహక ప్రాంతాలలోని ప్రజలు నదిలోకి వెళ్లకుండా అధికారులు తుఫాన్ తీవ్రతపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఏలూరు కలెక్టరేట్ లో 18002331077, 08812-224519 , 9491041419 ఫోన్ నంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు ఈ నంబర్లకు ఫోన్ చేసి తుఫాన్ తీవ్రతను తెలుసుకోవచ్చని, ప్రజలు తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. చెట్లు కూలిపోయిన కారణంగా విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న కల్వర్టులు, కాజ్ వే ల వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో శిధిల భవనాలు, చెట్లు కారణంగా ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఆర్డీఓ లు లక్ష్మి ప్రసన్న, రమణ, ట్రాన్స్కో ఎస్ఈ కే యం అంబేద్కర్ , పంచాయతీరాజ్ ఎస్ఈ జెడ్. రమేష్, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, ప్రభృతులు పాల్గొన్నారు.