చింతల్‌లో లబ్ధిదారులకు అందజేసిన మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు
కుత్బుల్లాపూర్ మేజర్ న్యూస్ :పేద ప్రజలకు మెరుగైన వైద్య చికిత్స అందించాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మంజూరు చేయించిన ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్వోసీ పత్రాలను ఆదివారం చింతల్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆయా డివిజన్లకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా మెరుగైన వైద్య చికిత్స పొందేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎల్వోసీ సదుపాయం ఉపయోగపడుతుందని తెలిపారు.
అర్హులైన పేదలకు వైద్య సహాయం అందేలా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని అవసరమైన వైద్య చికిత్స పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గాజులరామారం డివిజన్ పరిధిలోని లెనిన్ నగర్‌కు చెందిన మహేందర్ చౌహాన్‌కు రూ.1.50 లక్షలు, సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీకి చెందిన ఎల్. ఇందిరకు రూ.2 లక్షలు, రాంరెడ్డి నగర్‌కు చెందిన టి. రామచంద్రరావుకు రూ.3.50 లక్షలు, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేటకు చెందిన తల్లారి శిరీషకు రూ.2.50 లక్షల ఎల్వోసీ పత్రాలను అందజేశారు. మొత్తం నలుగురు లబ్ధిదారులకు రూ.9.50 లక్షల విలువైన వైద్య సహాయానికి సంబంధించిన పత్రాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, ఆగం రాజు, పీఏసీఎస్ డైరెక్టర్ పరుశ శ్రీనివాస్ యాదవ్, పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, డివిజన్ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు వారాల వినోద్, గుబ్బల లక్ష్మీనారాయణ, రాజ్ కుమార్, ప్రవీణ్, సాంబశివరెడ్డి, శివా నాయక్, సమ్మయ్య యాదవ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.