ఎన్‌టీఆర్ నగర్‌లో కిడ్నాప్ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు .
గచ్చిబౌలి,మేజర్ న్యూస్ : స్నేహితుడిని గుర్తుతెలియని వ్యక్తులు ఇన్నోవా వాహనంలో తీసుకెళ్లడంతో కిడ్నాప్ జరిగిందని భావించిన ఓ వ్యక్తి గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి, సదరు వ్యక్తిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన ఎన్‌టీఆర్ నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగారానికి చెందిన ఐటీ ఉద్యోగి పి. భార్గవ్ రాజ్ (31), తన పాఠశాల స్నేహితుడు పి. శ్యామ్‌తో కలిసి అక్టోబర్ 24న గోపన్‌పల్లిలోని వెస్ట్‌సైడ్ వైన్స్ పర్మిట్ రూమ్‌కు వెళ్లాడు.
అక్కడ మద్యం సేవించిన అనంతరం భోజనం చేసేందుకు ఎన్‌టీఆర్ నగర్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో ఎన్‌టీఆర్ నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు బూడిద రంగు ఇన్నోవా వాహనంలో శ్యామ్‌ను తీసుకెళ్లినట్లు భార్గవ్ రాజ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.దీంతో తన స్నేహితుడు కిడ్నాప్‌కు గురయ్యాడని అనుమానించిన భార్గవ్ రాజ్.. అదే రోజు రాత్రి 11.12 గంటలకు డయల్ 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. అనంతరం శ్యామ్‌ను గుర్తించి అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.