ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు
నెక్కొండ, మేజర్ న్యూస్, ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకొని ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడిన ఘటన నెక్కొండ మండలం పత్తిపాక గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అక్కెనపెల్లి సారమ్మ అనే వృద్ధురాలు చుట్ట తాగేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె చీరకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఆమె శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి.ఈ ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న నెక్కొండ 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ ఉపేందర్, పైలట్ రమేష్ హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన సారమ్మకు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించిన 108 అంబులెన్స్ సిబ్బంది సేవలను స్థానికులు అభినందించారు.
రిపోర్టర్ ;శ్రావణి ,నెక్కొండ, వరంగల్ జిల్లా