రూ.195 కోట్లతో నిడదవోలు పట్టణాభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు: నిడదవోలు పట్టణ సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా గడిచిన రెండున్నరేళ్ల కాలంలో ఏకంగా రూ.195 కోట్ల అభివృద్ధి పనులను చేపట్టామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.ఆదివారం నిడదవోలు పట్టణంలోని 6, 7, 8, 9 వార్డుల్లో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బూరుగుపల్లి శేషారావు, మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థి మురాల జ్యోతి, కూటమి నాయకులతో కలిసి ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా వార్డుల కూటమి అభ్యర్థులు తురుగోపు సాగర్ (జనసేన), గుర్రపు శాంతి శ్రీ (జనసేన), గంగుల వెంకట లక్ష్మి (జనసేన),అంగర లక్ష్మి (టీడీపీ) తరఫున ఓటర్లను కలిసి మద్దతు కోరారు. ఇంటింటికీ తిరుగుతూ పట్టణ ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ, కూటమి ప్రభుత్వంలో నిడదవోలు పట్టణంలో జరిగిన ప్రగతిని వివరించి, స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వ పరిపూర్ణ సహకారంతో, అభివృద్ధికి చిరునామా అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్, మార్పునకు నిదర్శనమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంలో నిడదవోలులో రూ. వందల కోట్లతో జరుగుతున్న ప్రగతి పనులే కూటమి ప్రభుత్వ పనితీరుకు ప్రత్యక్ష నిదర్శనమని వెల్లడించారు. ఈ సందర్భంగా "ఊరూరా జరుగుతున్న అభివృద్ధిని, ఇంటింటికీ చేరుతున్న సంక్షేమ ఫలాలను చూసి మన నిడదవోలు బంగారు భవిష్యత్తు కోసం, పారదర్శకమైన స్థానిక పాలన కోసం కూటమి అభ్యర్థులకు మీ మద్దతు అందించాలి.
స్థానిక సంస్థలు బలోపేతమైనప్పుడే ప్రజాపాలన క్షేత్రస్థాయికి పటిష్టంగా చేరుతుంది. రాబోయే రోజుల్లో నిడదవోలును రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం. ఈ ఎన్నికల్లో కూటమికి మీ ఆశీస్సులు అందించాలని కోరుతున్నాను." అని ప్రజలకు పిలుపునిచ్చారు.