ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంజిల్లాలో ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ దేవరాజ్ పాటిల్ తెలిపారు. కపిలేశ్వరపురం మండలంలో సమస్యాత్మక గ్రామాలైన అద్దంకివారిలంక, కేదారిలంక గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించి పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. అనంతరం మండపేట రూరల్ సీఐ దొరరాజు, అంగర ఎస్‌ఐ విజయశంకర్, పోలీస్ సిబ్బందితో కలిపి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ దేవరాజ్‌పాటిల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, ప్రతి ఓటరు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రత కల్పించడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఓటర్లను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.