కూటమి అభ్యర్థుల గెలుపు రాష్ట్ర అభివృద్ధికి మలుపు : రావులపాలెంలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
రావులపాలెం, మేజర్ న్యూస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆదివారం రావులపాలెం మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున జనసేన ఇన్‌ఛార్జి బండారు శ్రీనివాస్, బీజేపీ నాయకుడు తమలంపూడి రామకృష్ణారెడ్డితో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రెండున్నరేళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అర్నబ్ తుఫాన్ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విపత్తుల సమయంలో ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు.
ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కొనసాగుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం ద్వారా గ్రామాల అభివృద్ధికి స్థానిక సంస్థల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించాలని ఆకాంక్షించారు. రావులపాలెం జడ్పీటీసీ అభ్యర్థి చిన్నం సత్యలక్ష్మితో పాటు 24 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.