దొడ్డు బియ్యం మాటున సన్న బియ్యం!
*--అక్రమ రవాణాపై అనుమానాలు.*
*--రెండు టాటా ఏసీ వాహనాలు, కంటైనర్ పోలీసులకు అప్పగింత.* *--180కి పైగా బస్తాలు పట్టుబడినట్లు సమాచారం.*
నవాబుపేట సూర్య న్యూస్:దొడ్డు బియ్యం కొనుగోలు మాటున సన్న బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో మండలంలో బియ్యం రవాణా వ్యవహారం కలకలం రేపింది.ఆదివారం రాత్రి నవాబుపేట మండలంలోని లింగంపల్లి, అమ్మాపూర్ గ్రామాల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది.రెండు టాటా ఏసీ వాహనాల్లో బియ్యం బస్తాలను తరలించి,అక్కడ సిద్ధంగా ఉంచిన కంటైనర్‌లోకి ఎక్కిస్తున్న క్రమంలో బీఆర్ఎస్ నాయకులు,గ్రామస్తులు గుర్తించి అడ్డుకున్నారు.వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బియ్యం బస్తాలను పరిశీలించారు.ప్రాథమిక సమాచారం ప్రకారం జహీరాబాద్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్ టెండర్ ద్వారా రేషన్ దొడ్డు బియ్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.అయితే ఆ బియ్యంతోపాటు సన్న బియ్యం బస్తాలు కూడా ఉండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సన్న, దొడ్డు బియ్యం కలిపి సుమారు 180కి పైగా బస్తాలు ఉన్నట్లు సమాచారం.దీంతో బియ్యం రవాణాకు ఉపయోగించిన రెండు టాటా ఏసీ వాహనాలతోపాటు కంటైనర్‌ను పోలీసులకు అప్పగించారు.అనంతరం పోలీసులు పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం అందించారు.టెండర్ ద్వారా దొడ్డు బియ్యం కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించినప్పటికీ,అందులో సన్న బియ్యం బస్తాలు ఎలా వచ్చాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.ఇదిలా ఉండగా,ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులు వాహనాలను అక్కడే వదిలి కారులో పరారైనట్లు స్థానికులు తెలిపారు.*అసలు బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది?* ఈ బియ్యం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు?ఏ రేషన్ దుకాణాల నుంచి తరలించారు?టెండర్ ద్వారా కొనుగోలు చేసిన దొడ్డు బియ్యంలో సన్న బియ్యం ఎలా చేరాయి?ఈ రవాణా వెనుక ఎవరున్నారు?అన్న ప్రశ్నలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.ఈ వ్యవహారంపై పౌరసరఫరాల శాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి,అక్రమ రవాణా జరిగిందా లేదా అనే విషయాన్ని తేల్చి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.