telangana
విద్యార్థుల వికాసానికి ఆచరణాత్మక బోధన ముఖ్యం - కలెక్టర్ భవేశ్ మిశ్రా.
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి : విద్యార్థులు పాఠ్యాంశాలను నిత్యజీవిత అనుభవాలతో అనుసంధానం చేసుకొని నేర్చుకునేలా ఆచరణాత్మక బోధన అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు.మంగళవారం కుంటాల మండలం కల్లూరు గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) ఆకస్మికంగా తనిఖీ చేసి, వసతి గృహం, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పారిశుద్ధ్యం పాటించాలని, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతం పెంచాలని అధికారులను ఆదేశించారు.వసతి గృహంలో నీటి సమస్య పరిష్కారానికి రూ.4.80 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. డ్రైనేజీ, సోలార్ కంచె ఏర్పాటు, బెంచీల సమకూర్పుతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని వెల్లడించారు.అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి, జీవశాస్త్ర పాఠ్యాంశాన్ని బోధిస్తూ వారి అవగాహనను పరీక్షించారు. నిత్యజీవిత అంశాల ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కూరగాయల బరువును అంచనా వేయించి, సరైన అంచనా వేసిన విద్యార్థులకు పెన్నులు బహుమతిగా అందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసీల్దార్ కమల్ సింగ్, ఎంపీఓ శోభన, ఎంఈఓ ముత్యం, సర్పంచ్ దశరథ్ తదితరులు పాల్గొన్నారు.