పోలీస్ అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం : ఎస్ఐ కే. మహేందర్ రెడ్డి
మాగనూర్, మేజర్ న్యూస్, :పోలీస్ అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఎస్ఐ కే. మహేందర్ రెడ్డి అన్నారు.
జిల్లా ఎస్పీ డాక్టర్ జి. వినీత్ ఆదేశాల మేరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మాగనూరు పోలీస్ స్టేషన్‌లో
ఎస్ఐ కే. మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పాఠశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలు, పోలీసుల విధులు, నేరాల దర్యాప్తు ప్రక్రియ, ప్రజల రక్షణలో పోలీస్ శాఖ పోషిస్తున్న పాత్ర గురించి విద్యార్థులకు వివరించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని లాకప్, సీసీ కెమెరాల వ్యవస్థ, పోలీసుల వద్ద ఉండే ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలు, వాకీటాకీ ( విహెచ్ ఎఫ్సెట్) వినియోగం తదితర అంశాలను విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించి వారికి అవగాహన కల్పించారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 సేవలను ఎలా వినియోగించుకోవాలో వివరించారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండటం, మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కే. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశ భద్రత, ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధులు నిర్వర్తిస్తూ ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, వారు చూపిన సేవాభావం, కర్తవ్యనిష్ఠను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
విద్యార్థులు చిన్ననాటి నుంచే చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. క్రమశిక్షణతో మెలుగుతూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆయన సూచించారు. సమాజంలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు భయపడకుండా పోలీసులను సంప్రదించాలని,
ముఖ్యంగా సైబర్ నేరాల బారిన పడకుండా అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కార్యక్రమంలో విద్యార్థులు పోలీస్ శాఖ పనితీరుపై ఆసక్తి కనబరిచి పలు ప్రశ్నలు అడగగా, ఎస్ఐ మరియు పోలీసు సిబ్బంది వాటికి సమాధానాలు ఇచ్చారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ప్రాధాన్యతను వివరిస్తూ, పోలీస్ శాఖ కార్యకలాపాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం, యువతలో చట్టాల పట్ల గౌరవం పెంపొందించడం, ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
ఆంజనేయులు , సూర్య రిపోర్టర్ మాగనూర్ మండలం