సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : జాతీయ ఎయిడ్స్ నియంత్రణా మండలి ఆదేశాల మేరకు జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణకు సంబంధించిన నిర్దేశిత లక్ష్యాలను వంద శాతం సాధించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణా విభాగ సిబ్బందితో మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎయిడ్స్ సురక్ష (మాస్) పనితీరు పై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న 'సాక్షం' స్థితి నుంచి పూర్తి స్థాయి 'సురక్షిత్' సాధించేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా వైద్యాధికారి, అదనపు వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలోని రక్త నిధి కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన, సురక్షితమైన రక్త సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సేకరించిన ప్రతి రక్త యూనిట్‌ను నిబంధనల ప్రకారం కచ్చితంగా పరీక్షించాలని, ఒకవేళ హెచ్‌ఐవీ లేదా సిఫిలిస్ లక్షణాలు ఉన్నట్లు తేలితే వెంటనే ఐసీటీసీ కేంద్రాల ద్వారా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఆ బాధితులకు రిమ్స్ ఆసుపత్రిలోని ఏఆర్టీ కేంద్రం ద్వారా ఉచితంగా మందులు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ సమావేశానికి ముందు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు కలెక్టర్ నగదు బహుమతులతో పాటూ ప్రశంస పత్రాలను అందజేశారు. అలాగే, హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నియంత్రణలో విశేష ప్రతిభ కనబరిచి మంచి ఫలితాలు సాధించిన లింక్ వర్కర్లకు ప్రోగ్రామ్ సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యధికారి డాక్టర్ సాధన, అదనపు వైద్యాధికారి మనోహర్, వైద్యులు ఈశ్వర్, ప్రోగ్రామ్ మేనేజర్ నాగరాజు, జిల్లా ఎయిడ్స్ నివారణ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఏఆర్టీ, సహాయోగి సిబ్బంది, రక్త నిధి సిబ్బంది, విద్యార్థులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.