సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : కొమరం భీమ్ జిల్లాలో అత్యంత పేదరికంలో ఉన్న వారిని గుర్తించి, వారి జీవితంలో మార్పులు తీసుకురావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె.హరిత, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు, జిల్లా అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం. డేవిడ్, జిల్లా అటవీ అధికారి బాలమణి లతో కలిసి తెలంగాణ సమగ్ర జీవనోపాదుల కార్యక్రమం, వి బి జి రామ్ జి పథకంలో చేపట్టవలసిన పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో తెలంగాణ సమగ్ర జీవనోపాదుల కార్యక్రమం క్రింద 3 వేల అత్యంత పేద కుటుంబాలను గుర్తించడం జరిగిందని, వారిలో మార్పులు తీసుకువచ్చే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని, ఈ కార్యక్రమం జిల్లాలోని తిర్యాణి, లింగాపూర్ మండలాలలో చేపట్టడం జరిగిందని తెలిపారు. వి బి జి రామ్ జి పథకం క్రింద అర్హులైన కుటుంబాలకు 125 రోజులు పని కల్పించాలని, జిల్లాలో 1 లక్ష 22 వేల 633 జాబ్ కార్డులు ఉన్నాయని, ఈ పథకం ద్వారా 375 రకాల పనులు చేపట్టవచ్చని తెలిపారు. గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడి, మహిళా సమాఖ్య భవనాలు, గిడ్డంగుల నిర్మాణాలు చేపట్టవచ్చని తెలిపారు. జలసిరి పథకం ద్వారా పంట కుంటలు, ఊట కుంటలు, నీటి కుంటలు, ఇంకుడు గుంతల నిర్మాణం ద్వారా భూమిలో నీరు ఇంకి భూగర్భ జలం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఎల్ నినో ప్రభావం వల్ల వి బి జి రామ్ జి పథకం క్రింద పెద్ద ఎత్తున కూలీలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో టి జి ఐ ఎల్ పి ప్రాజెక్టు, వి బి జి రామ్ జి పథకం పకడ్బందీగా అమలుచేసి పెద్ద ఎత్తున కూలీలకు పనులు కల్పించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు.అనంతరం కమిషనర్ ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, టి జీ ఐ ఎల్ పి ప్రాజెక్టు అధికారులు, శిక్షకులు పాల్గొన్నారు.