అయ్యవారిపల్లిలో ఉచిత పశువైద్య శిబిరం
* పాడి పశువులకు ఖనిజ లవణాలు తప్పనిసరిగా అందించాలి: డా. ప్రవీణ్ కుమార్
ఉప్పునుంతల, సూర్య న్యూస్:
పశుసంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లి గ్రామంలో ఉచిత ఫర్టిలిటీ క్యాంపు, నట్టల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జగత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మండల పశువైద్యాధికారి డా. ప్రవీణ్ కుమార్ రైతులకు పశుపోషణపై అవగాహన కల్పించారు. ప్రతి పాడి పశువుకు ఖనిజ లవణ మిశ్రమాన్ని తప్పనిసరిగా అందించాలని సూచించారు. దూడలకు పుట్టిన వారంలోపే తొలిసారి నట్టల నివారణ మందులు వేయాలని, అనంతరం ఆరు నెలల వయస్సు వచ్చే వరకు నెలకోసారి మందులు తాగించి ఆరోగ్యంగా పెరిగేలా చూడాలని తెలిపారు.ప్రస్తుత కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జాబ్ కార్డు ఉన్న పాడి రైతులు, గొర్రెలు, మేకలు, పందుల పెంపకందారులు సంబంధిత షెడ్ల నిర్మాణానికి వీబీ-జీ రామ్ జీ పథకం ద్వారా లభించే ఆర్థిక సహకారాన్ని వినియోగించుకోవచ్చని వివరించారు. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా పశుపోషణ ఖర్చుల కోసం బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు పొందే అవకాశం ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పశువైద్యులు డా. రంజిత్, గోపాలమిత్ర సూపర్‌వైజర్ మురళీధర్, ముజీబ్, అంజయ్య, తిరుపతయ్య, శ్రీను, గ్రామ రైతులు పాల్గొన్నారు.