telangana
జనాభా గణన వివరాలను స్పష్టంగా నమోదు చేయాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి : జనగణన–2027 2వ దశలో భాగంగా నిర్వహించనున్న జనాభా గణన కార్యక్రమంలో వివరాలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ముఖ్య ప్రణాళిక అధికారి పాపయ్య, డైరెక్టరేట్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్ రాష్ట్ర కన్సల్టెంట్ కె.కృష్ణయ్య, మాస్టర్ ట్రైనర్ శరణ్య లతో కలిసి జిల్లా స్థాయి అదనపు ఛార్జ్ అధికారులు, మండల స్థాయి ఛార్జ్ అధికారులు, అదనపు ఛార్జ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనగణన మొదటి దశలో గృహాల జాబితా తయారీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు, సిబ్బంది ప్రస్తుతం 2వ దశలో జనాభా గణనను ఖచ్చితత్వంతో, పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. జనగణనకు సంబంధించిన అన్ని అంశాలపై ఛార్జ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్లకు అవసరమైన మార్గదర్శకాలు అందించాలని తెలిపారు. జనగణన ప్రశ్నావళిలోని ప్రతి ప్రశ్నపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, ఏ వివరాన్ని ఏ విధంగా నమోదు చేయాలనే అంశంపై పూర్తి పట్టు సాధించాలని సూచించారు. అధికారులకు 2 రోజుల పాటు శిక్షణ అందించనున్నందున, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అన్ని అంశాలను క్షుణ్ణంగా నేర్చుకోవాలని తెలిపారు. శిక్షణలో భాగంగా డెమో యాప్ను ప్రత్యక్షంగా చూపించనున్నందున, దాని వినియోగంపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని, ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. జనగణన ద్వారా సేకరించే వివరాలు 16వ ఆర్థిక సంఘం నిధులు, గ్రాంట్లు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు సంబంధించిన నిధుల కేటాయింపులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, సమాచార సేకరణలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. ఎన్యుమరేటర్లు ప్రతి ప్రశ్నను సంబంధిత వ్యక్తిని అడిగి, సమాధానాలను నిబంధనల ప్రకారం నమోదు చేయాలని తెలిపారు. మతం, కులం, వైవాహిక స్థితి, వివాహ సమయానికి వయస్సు. తండ్రి, తల్లి పేర్లు, పుట్టిన తేదీ, జన్మస్థలం, మతం వివరాలు, దివ్యాంగత్వానికి సంబంధించిన వివరాలు, అక్షరాస్యత స్థితి, డిజిటల్ అక్షరాస్యత, విద్యాసంస్థలలో ప్రస్తుతం చదువుతున్నారా అనే వివరాలు, 11వ తరగతి / అంతకంటే పై తరగతులలో చదివిన వారికి వర్తించే అత్యున్నత విద్యార్హత, విద్యా విభాగం (స్ట్రీమ్) వివరాలు, ప్రతి ప్రశ్నకు సంబంధించిన ఉద్దేశాన్ని అర్థం చేసుకొని, సమాధానాలను సక్రమంగా, స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. జనాభా గణన ప్రక్రియలో ఎన్యుమరేటర్లు అడగవలసిన ప్రశ్నలను వదిలివేయకుండా ప్రతి వివరాన్ని సేకరించాలని తెలిపారు. ప్రతి వివరాన్ని బాధ్యతాయుతంగా, ఖచ్చితత్వంతో నమోదు చేయాలని తెలిపారు. శిక్షణలో భాగంగా జనగణన శిక్షకులు జనాభా గణన ప్రశ్నావళిలోని వివిధ అంశాలపై అధికారులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి పాపయ్య, డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ రాష్ట్ర కన్సల్టెంట్ కె. కృష్ణయ్య, డి వై ఎస్ ఓ రాజేందర్, మాస్టర్ ట్రైనర్ శరణ్య, తహసిల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, సంబంధిత జనగణన అధికారులు పాల్గొన్నారు.