నెల్లూరు 59వ డివిజన్‌లో జోరుగా ఎన్నికల ప్రచారం
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డితో పాటు కార్పొరేటర్ అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం నెల్లూరు నగరంలోని 59వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి కిషన్‌కు మద్దతుగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసులు, మేయర్ అభ్యర్థి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, పార్టీ నాయకులతో కలిసి కాకాణి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా శ్రీరామ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, సామాన్య ప్రజల జీవనం భారంగా మారిందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి పరిస్థితులను, ప్రస్తుత కూటమి పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని కోరారు.
పన్నుల పేరుతో ప్రజలపై భారం
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నెల్లూరు నగర ప్రజలపై పన్నుల భారం మోపారని కాకాణి ఆరోపించారు. పేద, మధ్యతరగతి ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల నుంచి వసూలు చేసిన నిధులను నగర అభివృద్ధికి వినియోగించకుండా చెట్లు, చెత్త పేరుతో దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. నగర ప్రజల సంక్షేమాన్ని, వ్యాపారుల సమస్యలను పట్టించుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
పోలీసుల తీరుపై కాకాణి ఆగ్రహం
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను బెదిరించి పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాకాణి ఆరోపించారు. జిల్లాలో కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ నాయకులకు ఫోన్లు చేసి ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. బెదిరింపులు, ప్రలోభాలు, బలవంతపు ఏకగ్రీవాలతో ఎన్నికల్లో విజయం సాధించాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రజల మద్దతుతో గెలవలేకనే అధికార బలాన్ని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.
ఆనం కుటుంబానికి సేవా చరిత్ర
నెల్లూరు నగర అభివృద్ధిలో ఆనం కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉందని కాకాణి పేర్కొన్నారు. ఏసీ సుబ్బారెడ్డి కాలం నుంచి ఆనం కుటుంబం ప్రజలకు సేవలందిస్తోందన్నారు. ఆ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని తెలిపారు. అనుభవం, ప్రజల సమస్యలపై అవగాహన కలిగిన విజయ్‌కుమార్‌రెడ్డిని మేయర్‌గా గెలిపిస్తే నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థులందరినీ గెలిపించి ఆయనకు బలమైన బృందాన్ని అందించాలని కోరారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి
కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని కాకాణి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం గురించి చెప్పుకోలేక అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను కోరారు. నగర ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మేయర్ అభ్యర్థి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డితో పాటు 59వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కిషన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.