telangana
వైభవంగా ఆరట్టు మహోత్సవం - ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : ఆదిలాబాద్ పట్టణంలోని అశోక్ రోడ్డులో శాస్త్రి నగర్ నుంచి బ్రాహ్మణవాడ వరకు ఆదివారం నిర్వహించిన అయ్యప్ప స్వామి ఆరట్టు మహోత్సవం భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగింది. అయ్యప్ప భక్తుల శరణుఘోషలతో పరిసర ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యతాభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. అయ్యప్ప దీక్షలో భాగంగా భక్తులు పాటించే కఠిన నియమాలు, క్రమశిక్షణ, నిష్ఠ, సామాజిక సమానత్వం ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా యువతకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. భక్తిభావంతో పాటు పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ భక్తులు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో జిల్లా ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.అనంతరం శంకరన్ నంబూద్రి గురుస్వామి, ఆలయ ప్రధాన అర్చకులు సంతోష్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహోత్సవానికి తరలివచ్చిన అయ్యప్ప మాలధారులు, భక్తులకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి కలమడుగుల సంతోష్, కమిటీ సభ్యులు, గురుస్వాములు, అయ్యప్ప మాలధారులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.