ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందాం. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి
అహోబిలం ఘటన రాజకీయ వ్యవస్థకు ఒక హెచ్చరిక. --గంగుల ఫణికృష్ణారెడ్డి --ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజాస్వామ్యం ఓడిపోకూడదు. --ఎన్నికలు అభివృద్ధి వేదికలుగా మారాలని హితవు
--ప్రజాస్వామ్య విలువలు కాపాడుకుందాం. --అధికారం కంటే మానవత్వం మిన్న --రాజకీయ ఆధిపత్యం కాదు.. ప్రజాసేవే ప్రధానం
--పార్టీలకు అతీతంగా ఎన్నికల సంస్కరణలు చేపట్టాలి. --అహోబిలం ఘటనపై తీవ్ర ఆవేదన. ----ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగ సవరణలు అవసరం
---ఎన్నికలు అభివృద్ధి వేదికలుగా మారాలని హితవు. --భావితరాలకు ఆరోగ్యకరమైన రాజకీయాలు అందిద్దాం. --ప్రధాని, ఎంపీలకు గంగుల ఫణికృష్ణారెడ్డి విజ్ఞప్తి
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్: నియోజకవర్గంలోని అహోబిలం పుణ్యక్షేత్రంలో ఇటీవల సర్పంచ్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయని గంగుల ఫణికృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి పవిత్ర సన్నిధిలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని, ఆ ప్రాంతంలో తిరిగి శాంతి, సామరస్యం నెలకొల్పాలని స్వామివారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అహోబిలం ఘటనను కేవలం ఒక గ్రామంలో జరిగిన రాజకీయ ఘర్షణగా మాత్రమే చూడకూడదని, ఇది దేశ రాజకీయ వ్యవస్థ మొత్తం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయమని పేర్కొన్నారు.
గెలుపు కంటే ప్రజాస్వామ్యం ముఖ్యం
ఏ ఒక్క పార్టీనో, వ్యక్తినో లక్ష్యంగా చేసుకుని తాను మాట్లాడటం లేదని, ప్రజాస్వామ్యానికి, మానవత్వానికి విరుద్ధంగా జరిగే చర్యలను ఎవరైనా ప్రశ్నించాల్సిందేనని గంగుల ఫణికృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలవాలనే తపన కోసం గ్రామాల్లో వైషమ్యాలు సృష్టించడం, ప్రజల ప్రశాంత జీవనాన్ని దెబ్బతీయడం సరికాదన్నారు. ఎన్నికల్లో గెలవడం ముఖ్యం కావచ్చు కానీ, ఆ క్రమంలో ప్రజాస్వామ్యం ఓడిపోవడం సమాజానికి మంచిది కాదని హితవు పలికారు. రాజకీయ ప్రత్యర్థి అంటే శత్రువు కాదని, ఎన్నికలు అభివృద్ధి కోసం జరగాలే తప్ప ఆధిపత్యం కోసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తాగునీరు, సాగునీరు, రహదారులు, విద్య, వైద్యం, ఉపాధి వంటి అంశాలే ఎన్నికల్లో ప్రధాన చర్చగా ఉండాలన్నారు.
*నిష్పాక్షిక విచారణ జరగాలి*
ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలని ఫణికృష్ణారెడ్డి కోరారు. అహోబిలం ఘటనతో పాటు ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లో జరిగినట్లు వార్తల్లో వచ్చిన ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో నిర్ధారణ కాని ఆరోపణలతో ఎవరినీ దోషులుగా చిత్రీకరించకూడదని, వాస్తవాలు వెలుగులోకి రావాలని పేర్కొన్నారు. మహిళలు, వృద్ధులు, యువత ఎలాంటి భయం లేకుండా ఓటు వేసే వాతావరణం కల్పించడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత అన్నారు.
ప్రధాని, పార్లమెంటు సభ్యులకు విజ్ఞప్తి
ఈ పరిణామాలను కేవలం స్థానిక సమస్యగా చూడకుండా, దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సంబంధించిన విస్తృత అంశంగా పరిగణించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఉభయ సభల పార్లమెంటు సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమ ధనప్రభావం, బలప్రయోగం, అధికార దుర్వినియోగం, ఓటర్లను ప్రలోభపెట్టడం వంటి వాటికి తావులేకుండా పార్టీలకు అతీతంగా సమగ్ర రాజ్యాంగ, చట్టపరమైన సంస్కరణలపై ఆలోచించాలని కోరారు.
*అధికారం కంటే మానవత్వం మిన్న*
భారత రాజ్యాంగం కేవలం పాలకులను నియంత్రించే పుస్తకం కాదని, మనలోని విచక్షణను మేల్కొలిపే మార్గదర్శకమని ఫణికృష్ణారెడ్డి అన్నారు. అధికార దాహం మానవత్వాన్ని అధిగమించకూడదని, రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన రాజకీయ వ్యవస్థను అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. మనకు కావాల్సింది అధికారాన్ని సాధించే రాజకీయాలు కాదని, ప్రజల భవిష్యత్తును నిర్మించే రాజకీయాలని తన ప్రకటనలో ఆకాంక్షించారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా