సూర్య ఉట్నూర్ : సరైన స్టడీ మెటీరియల్, క్రమబద్ధమైన ప్రణాళికతో చదివితే ఉపాధ్యాయ అర్హత పరీక్షలో తప్పకుండా విజయం సాధించవచ్చని ఎస్‌ఏ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు సామ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. గతంలో మూడుసార్లు టెట్ రాసి ఆశించిన ఫలితం సాధించలేకపోయిన ఆయన, ఇటీవల జరిగిన పరీక్షలో వంద మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌లో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకత్వం రూపొందించిన టెట్ స్టడీ మెటీరియల్ తన విజయానికి ఎంతో దోహదపడిందని తెలిపారు. నిరాశలో ఉన్న తనకు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ్ రవికుమార్ ధైర్యం చెప్పి, కేవలం రూ.500లకే మెటీరియల్ అందించారని చెప్పారు. ఈ మెటీరియల్‌తో నిరంతర సాధన చేయడం వల్లే మంచి మార్కులు సాధించగలిగానని హర్షం వ్యక్తం చేశారు. తన విజయానికి మార్గదర్శకత్వం వహించిన జాదవ్ రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి చవాన్ శీతల్ దంపతులను ఇంటికి ఆహ్వానించి మిఠాయిలు తినిపించి కృతజ్ఞతలు తెలిపారు. నాణ్యమైన మెటీరియల్ రూపొందించిన రాష్ట్ర అధ్యక్షులు జి. సదానందం గౌడ్, ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, జిల్లా అధ్యక్షులు మూగ శ్రీనివాస్‌లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.