విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా దృక్పథం, సృజనాత్మకతను వెలికితీసేలా జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన – 2026
సంగారెడ్డి, మేజర్ న్యూస్ ప్రతినిధి:- విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు, వారిలో దాగి ఉన్న సృజనాత్మకత, నూతన ఆవిష్కరణల ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన-2026 ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని కమిటీలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి సూచించారు.సంగారెడ్డి పట్టణంలోని సెయింట్ ఆంటోనీ, శాంతినగర్ పాఠశాలలో డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాట్లపై శనివారం ఆమె 13 కమిటీల కన్వీనర్లు, కో-కన్వీనర్లు, సభ్యులతో ముందస్తు సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి కమిటీకి కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ఫుడ్ కమిటీ, బాలికల వసతి కమిటీ, స్టేజ్ కమిటీ, మీడియా కమిటీలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని తెలిపారు.వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థులందరికీ నాణ్యమైన భోజనం, సురక్షితమైన వసతి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.సమావేశంలో సెయింట్ ఆంటోనీస్ విద్యాసంస్థల చైర్మన్ సాల్మన్ రెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రతి సంవత్సరం జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించడం తమకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. జిల్లాలోని విద్యార్థుల విద్యా, వైజ్ఞానిక ప్రతిభను ప్రోత్సహించేందుకు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా ప్రదర్శన విజయవంతానికి అవసరమైన అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు.వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహణను సమర్థవంతంగా చేపట్టేందుకు వివిధ మండల విద్యాధికారులకు కమిటీల వారీగా ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా సంగారెడ్డి మండల విద్యాధికారి విద్యాసాగర్‌కు స్టేజ్, డిసిప్లిన్, ఫుడ్ కమిటీల బాధ్యతలు అప్పగించారు. కోహిర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్‌కు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ బాధ్యతలు, పుల్కల్ మండల విద్యాధికారికి హెల్త్ అండ్ హైజీన్, ఆర్గనైజింగ్, హెల్ప్ కమిటీల బాధ్యతలు అప్పగించారు.కంది మండల విద్యాధికారి జోగప్పకు రిజిస్ట్రేషన్, డిస్ప్లే కమిటీల బాధ్యతలు, రాయికోడ్ మండల విద్యాధికారి నర్సింలుకు స్టేజ్, కల్చరల్, ఇన్విటేషన్ కమిటీల బాధ్యతలు అప్పగించారు.కమిటీలన్నీ తమకు కేటాయించిన విధులను సమన్వయంతో నిర్వహించి, వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలని సూచించారు.ఈ సమావేశంలో డి సి ఈ బి సెక్రటరీ లింబాజీ,ఐదు మండలాల విద్యాధికారులు, జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, 13 కమిటీల కన్వీనర్లు, కో-కన్వీనర్లు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.