telangana
భూ భారతి రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి.కలెక్టర్ కె. హైమావతి ఆదేశం
సిద్దిపేట మేజర్ న్యూస్ ప్రతినిధి: భూ భారతి చట్టంలో భాగంగా చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా, పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి రెవెన్యూ, సర్వే శాఖ అధికారులను ఆదేశించారు.శనివారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్‌తో కలిసి రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా భూ భారతి రీ సర్వే పనుల పురోగతి, భూముల వివరాల నమోదు, భూ రికార్డుల పరిశీలన, సర్వేలో ఎదురవుతున్న సమస్యలు, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా క్షేత్రస్థాయిలో భూముల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భూ రికార్డులను పారదర్శకంగా నమోదు చేయాలని, భూ సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.జిల్లాలోని ప్రతి మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో భూ భారతి రీ సర్వే ప్రక్రియ కొనసాగుతున్నందున అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. సర్వే వివరాలను రోజువారీగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. గ్రామాల్లో సర్వేయర్లు, లైసెన్స్‌డ్ సర్వేయర్లు, జీపీఓలు రోజుకు తప్పనిసరిగా 40 ఎకరాల చొప్పున సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ముందుగా గ్రామ సరిహద్దుల సర్వే చేపట్టాలని, సర్వే పూర్తయిన వెంటనే ఎల్‌ఆర్ అందించాలని స్పష్టం చేశారు.భూ భారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను నిర్ణీత కాలవ్యవధిలోగా పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రీ సర్వే పనుల్లో నిర్లక్ష్యం వహించకుండా నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని, పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో ఆర్డీవోలు సదానందం, చంద్రకళ రామ్మూర్తి, ఏడీ సర్వే సుదర్శన్, ఆయా మండలాల తహసీల్దార్లు, సంబంధిత రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.