శక్తి సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మహిళా కమిషన్ సభ్యులు
సంగారెడ్డి మేజర్ న్యూస్ ప్రతినిధి ; నవంబర్ 28:జాతీయ మహిళా కమిషన్ పిలుపు మేరకు, బిహార్ రాష్ట్ర మహిళా కమిషన్ సహకారంతో రాజ్‌గిర్‌లో నవంబర్ 27, 28 తేదీల్లో నిర్వహించిన ‘శక్తి సంవాద్’ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు పాల్గొన్నారు.దేశవ్యాప్తంగా మహిళా కమిషన్లను మరింత బలోపేతం చేయడం, మహిళల హక్కుల పరిరక్షణ, మహిళలపై జరుగుతున్న హింస, వివక్షను అరికట్టడం, మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ రాష్ట్రాల మహిళా కమిషన్ల చైర్‌పర్సన్లు, సభ్యులు, మహిళా కమిషన్ విభాగాల ప్రతినిధులు హాజరయ్యారు. జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయా రహత్కర్‌తో పాటు పలువురు జాతీయ స్థాయి ప్రముఖులు పాల్గొని మహిళల సంక్షేమం, భద్రత, సాధికారతకు సంబంధించిన అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తరఫున సభ్యులు కాసోజు శంకరమ్మ,శశికళ యాదవరెడ్డి , ఎన్. రాధాబాయి,చిట్యాల శ్వేత,
సదా లక్ష్మి, ఉజ్మాతో పాటు రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శి పద్మజ పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా మహిళల సమస్యల పరిష్కారానికి వివిధ రాష్ట్రాల మహిళా కమిషన్ల మధ్య సమన్వయం, అనుభవాల మార్పిడి, భవిష్యత్తు కార్యాచరణపై ఈ శక్తి సంవాద్ కార్యక్రమం వేదికగా చర్చలు జరిగాయి.