పీవోజేకేలో ఉగ్ర స్థావరాలపై జైషే కమాండర్ సంచలన అంగీకారం
సూర్య అంతర్జాతీయ డెస్క్: ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఆధారాలతో కూడిన ప్రాంతీయ యంత్రాంగం అవసరమని పాకిస్థాన్ పిలుపునిచ్చిన కొద్ది రోజులకే సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఐక్యరాజ్యసమితి నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ సీనియర్ కమాండర్ ఒకరు పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ ప్రాంతంలో తమకు సాయుధ స్థావరాలు ఉన్నాయని బహిరంగంగా అంగీకరించారు. అంతేకాకుండా పాకిస్థాన్ నిఘా సంస్థ అధికారులతో తమకు భేటీలు జరిగాయని కూడా ఆయన పేర్కొనడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇస్లామాబాద్‌లో జరిగిన పూంచ్ అవన్ సదస్సులో మాట్లాడిన జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ అలియాస్ అబూ మహమ్మద్, పీవోజేకే పరిధిలో తమ సంస్థకు చెందిన మౌలిక సదుపాయాల ప్రాంతాలను స్పష్టంగా ప్రస్తావించారు. తమ భూభాగంలో ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తున్నామన్న ఆరోపణలను పాకిస్థాన్ చాలా కాలంగా ఖండిస్తూ వస్తున్న నేపథ్యంలో, ఈ వ్యాఖ్యలు ఇస్లామాబాద్ వాదనలకు పూర్తి విరుద్ధంగా నిలిచాయి.
తన ప్రసంగంలో రావలకోట ప్రాంతంలో జైషే మహమ్మద్‌కు చురుకైన కార్యాకలాపాలు ఉన్నాయని కశ్మీరీ వెల్లడించారు. పూంచ్ జిల్లాలోని ధరంసల్ ప్రాంతంలో కూడా తమ సంస్థకు మరో కేంద్రం ఉందని ఆయన అంగీకరించారు. ఉగ్రవాద నెట్‌వర్క్‌లు లేవంటూ పాకిస్థాన్ పాలకులు చేస్తున్న ప్రకటనలకు ఈ వ్యాఖ్యలు గట్టి సవాల్‌గా మారాయి.
పాకిస్థాన్ నిఘా వర్గాలతో తనకు జరిగిన సంప్రదింపుల గురించి కూడా కశ్మీరీ కీలక విషయాలు బయటపెట్టారు. నిరసనల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 22 మంది జైషే సభ్యుల జాబితాను ఇస్లామాబాద్‌లో తమతో భేటీ అయిన నిఘా అధికారులు అందజేశారని ఆయన వెల్లడించారు. ఈ పరిణామంతో సరిహద్దు భద్రత, ఉగ్రవాద నిర్మూలన విషయంలో పాకిస్థాన్ వైఖరిపై మరోసారి తీవ్ర ప్రశ్నలు తలెత్తాయి.