బంగ్లాదేశ్ వైపు వెళ్తున్న చైనా ఓడను సీజ్ చేసిన ఇండోనేషియా నావికాదళం
సూర్య అంతర్జాతీయ డెస్క్: చైనా నుంచి బంగ్లాదేశ్ వైపు వెళ్తున్న ఒక కార్గో నౌకను ఇండోనేషియా నావికాదళం అడ్డుకుని స్వాధీనం చేసుకుంది. సుమారు ఐదు వేల టన్నుల సామర్థ్యం కలిగిన ఈ ఓడను తనిఖీ చేసిన అధికారులు, అందులో భారీ పరిమాణంలో సోడియం పెర్‌క్లోరేట్ రసాయనంతో పాటు లక్షలాది ఖాళీ ఫోర్-జీ ఎల్‌టీఈ సిమ్ కార్డులను గుర్తించారు. అనుమానాస్పద సంచలన కార్గో లభ్యం కావడంతో అంతర్జాతీయ భద్రతా వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
నౌకాదళ సిబ్బంది ఈ ఓడను బెలావాన్ నావల్ బేస్‌కు తరలించి మొత్తం 36 షిప్పింగ్ కంటైనర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇందులో 15 కంటైనర్లలో 400 టన్నులకు పైగా సోడియం పెర్‌క్లోరేట్ రసాయనాన్ని నిల్వ ఉంచినట్లు తేలింది. వస్త్ర పరిశ్రమ, బ్లీచింగ్ వంటి సాధారణ పారిశ్రామిక అవసరాలకు వినియోగించే ఈ రసాయనం, ఘన రాకెట్ ప్రొపెల్లెంట్ల తయారీలో శక్తివంతమైన ఆక్సిడైజర్‌గా కూడా ఉపయోగిస్తారు. దీంతో పాటు 54 ప్యాలెట్లలో ఏ ఫోన్ నంబర్ లేదా రిజిస్టర్డ్ యూజర్‌తో సంబంధం లేని లక్షలాది ఖాళీ సిమ్ కార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న ఎం.వి. స్టార్ లైన్ నౌక రిజిస్ట్రేషన్ రద్దయిందని, పలు షిప్పింగ్ పత్రాలు నకిలీవిగా కనిపిస్తున్నాయని ప్రాథమిక తనిఖీల్లో వెల్లడైంది. సముద్ర గమన ట్రాకింగ్ డేటా ప్రకారం ఈ నౌక సెప్టెంబర్ 12న చైనాలోని లియాన్యున్‌గాంగ్ ఓడరేవు నుంచి బయలుదేరినట్లు గుర్తించారు.
అధికారిక వాణిజ్య గణాంకాలు ఈ భారీ నిల్వపై మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. బంగ్లాదేశ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ లెక్కల ప్రకారం, 2010 నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు 50 వేర్వేరు సరుకుల ద్వారా బంగ్లాదేశ్ అధికారికంగా దిగుమతి చేసుకున్న సోడియం పెర్‌క్లోరేట్ మొత్తం 700 కిలోల కంటే తక్కువే. అలాంటిది ఇండోనేషియాలో పట్టుబడిన 400 టన్నుల నిల్వ ఆ పదహారేళ్ల మొత్తం దిగుమతి కంటే దాదాపు 600 రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. ఐక్యరాజ్యసమితి వాణిజ్య గణాంకాల ప్రకారం 2019 నుంచి 2025 మధ్య బంగ్లాదేశ్ దిగుమతి చేసుకున్న పెర్‌క్లోరేట్ సంబంధిత సమ్మేళనాలు 300 టన్నులకు కొద్దిగా ఎక్కువ కాగా, అందులో చైనా నుంచి వచ్చినవి కేవలం 11 టన్నులు మాత్రమే.
ఈ సరుకును ఎవరు కొనుగోలు చేశారు, బంగ్లాదేశ్‌లో ఎవరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇది కేవలం అక్రమ పారిశ్రామిక సరుకు రవాణా మాత్రమేనా లేక అంతకుమించిన వ్యూహాత్మక వ్యవహారమా అనేది విచారణ పూర్తయితేనే స్పష్టత రానుంది.