దీక్షా దివస్‌కు తరలిన గులాబీ దళం
సూర్య కొడిమ్యాల:దీక్షా దివస్ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను స్మరించుకుంటూ ఉద్యమ స్ఫూర్తిని చాటారు.
ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచుల ఫోరం కొడిమ్యాల మండల అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కేసీఆర్ చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు. ఆయన చేపట్టిన నిరాహార దీక్షతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, ప్రజా సంఘాల పాత్ర ఎంతో కీలకమైందని, అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాట ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైందని గుర్తుచేశారు. ఆ ఉద్యమ చరిత్రను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు.కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని, రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. దీక్షా దివస్ స్ఫూర్తితో ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని పునుగోటి కృష్ణారావు పిలుపునిచ్చారు.