రామన్నపేటలో రైతును అభినందించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
సూర్య బోయినపల్లి ..సంప్రదాయంగా వరిని సాగు చేస్తున్న ఆ రైతు దానిని వదిలి కూరగాయల సాగు వైపు ముందుకు వెళ్తున్నారు. నాలుగు ఎకరాల్లో నాలుగు రకాల పంటలు సాగు చేస్తున్నారు. మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా పంటలు సాగు చేస్తూ ఆదాయం పొందుతున్నారు. బోయినపల్లి మండలం రామన్నపేట కు చెందిన ఆదర్శ రైతు మిట్టపల్లి కమలాకర్ రెడ్డిని జిల్లా కలెక్టర్ అభినందించారు.బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన రైతు సంప్రదాయంగా సాగు చేస్తున్న వరిని వదిలిపెట్టారు. దాని స్థానంలో నాలుగు ఎకరాల్లో బూడిద గుమ్మడి, కూర (రాస) గుమ్మడి, మిర్చి, బీరకాయ సాగు చేస్తున్నారు మల్చింగ్ విధానంలో మిర్చి, బీరకాయ కోసం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఆయా పంటలకు నీటిని అందిస్తూ జల వనరులను సద్వినియోగం చేస్తున్నారు. గుమ్మడి ఎకరంలో సాగు చేయగా, అన్ని ఖర్చులు పోను రూ.80 వేల ఆదాయం, ఒక ఎకరం విస్తీర్ణంలో మిర్చి వేయగా, రూ. 2 లక్షలు ఆదాయం, ఒక ఎకరం విస్తీర్ణంలో బీరకాయ సాగు చేయగా, రూ. లక్ష ఆదాయం, 20 గుంటల్లో కూర (రాస ) గుమ్మడి సాగు చేయగా, రూ.30 వేల ఆదాయం వచ్చిందని రైతు మిట్టపల్లి కమలాకర్ రెడ్డి చెప్పారు.క్షేత్రస్థాయిలో పరిశీలించి.. అభినందనలు తెలిపి రైతు మిట్టపల్లి కమలాకర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. బూడిద గుమ్మడి సాగును పరిశీలించి.. సాగు విధానం, దిగుబడి.. మార్కెట్ సౌకర్యం పై అడిగి తెలుసుకున్నారు.
తాను వేములవాడ, కరీంనగర్ మార్కెట్ లో విక్రయిస్తానని, మంచి దిగుబడి ఆదాయం ఉందని రైతు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు.
అలాగే మల్చింగ్ విధానం, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో బీరకాయ, మిర్చి పంట సాగు చేస్తున్న విధానాన్ని పరిశీలించి అభినందించారు. మిగతా రైతులు కూడా వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసి ఆదాయాన్ని పొందాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.
పరిశీలనలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.