పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి: ఎస్‌ఐ-2 గాయత్రి
*నారాయణపేట, సూర్యన్యూస్* : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాల, కేజీబీవీ గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు టౌన్ ఎస్‌ఐ-2 గాయత్రి ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నియంత్రణ, సోషల్ మీడియా దుర్వినియోగం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రెండు కేటగిరీల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించగా 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు మొదటి కేటగిరీలో భాగంగా సైబర్ నేరాల నివారణలో పోలీసులు, పౌరుల పాత్ర, మాదకద్రవ్యాల నివారణలో పోలీసుల పాత్ర, విద్యార్థులు డ్రగ్స్‌కు ఎలా దూరంగా ఉండాలి అనే అంశాలపై పోటీలు నిర్వహించారు. అదేవిధంగా డిగ్రీ, ఆపై విద్యార్హతలు కలిగిన విద్యార్థులకు రెండో కేటగిరీలో సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంలో పోలీసుల పాత్ర, తెలంగాణను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నా పాత్ర’ అనే అంశాలను కేటాయించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక నష్టాలను వివరించి, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. సోషల్ మీడియాను బాధ్యతా యుతంగా వినియోగించడం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం, సమాజంలో చైతన్యం తీసుకురావడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించడమే లక్ష్యం, పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం, వారి సేవాస్ఫూర్తిని విద్యార్థుల్లో పెంపొందించడం, ప్రజాసేవలో పోలీసుల పాత్రను తెలియజేయడం ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ-2 గాయత్రి మాట్లాడుతూ, పోలీసు అమరవీరుల త్యాగాల ఫలితంగానే ప్రజలు ప్రశాంతంగా జీవించ గలుగుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు అమరవీరుల సేవాభావాన్ని ఆదర్శంగా తీసుకొని సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని సూచించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.