తుఫానును ఎదుర్కొనేందుకు ఏపీఈపీడీసీఎల్ సర్వసన్నద్ధం
సన్నద్ధతపై అధికారులతో సమీక్షించిన సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్
- 12 జిల్లాల్లో 30 డివిజన్ స్థాయి కంట్రోల్ రూమ్‌లు
- 438 బ్యాచ్‌లలో 4,339 మంది సిబ్బంది సిద్ధం
- ఎస్పీడీసీఎల్ నుంచి 97 బ్యాచ్‌ల అదనపు సిబ్బంది కేటాయింపు
- అదనంగా సుమారు 15,000 విద్యుత్ స్తంభాల మోహరింపు
- 24×7 అందుబాటులో 1912 కాల్ సెంటర్
సీతమ్మధార, మేజర్ న్యూస్ : ‘ఆర్నాబ్’ తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఏపీఈపీడీసీఎల్ అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందని సంస్థ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ తెలిపారు. తీర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయాలు ఏర్పడకుండా, ఒకవేళ అంతరాయాలు ఏర్పడితే వీలైనంత త్వరగా పునరుద్ధరించేలా సిబ్బంది, యంత్రాలు, వాహనాలు, అవసరమైన విద్యుత్ సామగ్రిని సిద్ధం చేసినట్లు వెల్లడించారు. తుఫాను సన్నద్ధతపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తూ, క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అక్టోబర్ 27 సాయంత్రం నుంచి తీర ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందని, ముఖ్యంగా కాకినాడ, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎండీ సూచించారు. గంటకు 120 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున విద్యుత్ వ్యవస్థల రక్షణకు, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
4,339 మంది సిబ్బంది.. భారీగా యంత్రాలు, సామగ్రి సిద్ధం
తుఫాను పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు 11 సర్కిల్లలో 30 డివిజన్ స్థాయి కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. సిబ్బంది మోహరింపు, తరలింపు, పునరుద్ధరణ పనుల సమన్వయం కోసం కార్పొరేట్ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను అందుబాటులోకి తెచ్చారు.
అత్యవసర విద్యుత్ పునరుద్ధరణ పనుల కోసం 438 బ్యాచ్‌లలో 4,339 మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. వీరికి అవసరమైన 244 జనరేటర్లు, 297 పోల్ డ్రిల్లింగ్ యంత్రాలు, 567 పవర్ సాలు, 239 క్రేన్లు, 121 జేసీబీలు, 382 వాహనాలను అందుబాటులో ఉంచారు. విద్యుత్ పునరుద్ధరణకు అవసరమైన 8,662 స్తంభాలు, 620 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, 272.702 కిలోమీటర్ల కండక్టర్లు నిల్వలో ఉన్నాయి. అదనంగా 100 చదరపు మి.మీ. కండక్టర్ 425 కిలోమీటర్లు, 55 చదరపు మి.మీ. కండక్టర్ 756 కిలోమీటర్లు, ఎల్‌టీ ఏబీ కేబుల్ 496 కిలోమీటర్లు అందుబాటులో ఉన్నాయి. దెబ్బతిన్న స్తంభాల స్థానంలో వెంటనే కొత్తవి ఏర్పాటు చేసేందుకు అదనంగా సుమారు 15,000 విద్యుత్ స్తంభాలను మోహరిస్తున్నట్లు సీఎండీ తెలిపారు.
ఎస్పీడీసీఎల్ నుంచి 97 బ్యాచ్‌ల అదనపు సిబ్బంది
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేందుకు ఏపీఎస్‌పీడీసీఎల్ నుంచి 97 బ్యాచ్‌లను కేటాయించే ప్రణాళిక రూపొందించారు. వీటిలో 55 బ్యాచ్‌ల సిబ్బంది ఇప్పటికే బయలుదేరారు. కర్నూలు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్ కడప, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల నుంచి ఈ బృందాలు తరలివస్తున్నాయి. జిల్లాలవారీగా తూర్పు గోదావరికి 232 మంది, కోనసీమకు 204 మంది, పశ్చిమ గోదావరికి 174 మంది, కాకినాడకు 194 మంది, అనకాపల్లికి 198 మంది సిబ్బందిని కేటాయించారు. అదనపు సిబ్బందిని స్వీకరించడం, అవసరమైన ప్రాంతాలకు పంపించడం, పునరుద్ధరణ పనుల్లో వినియోగించడంపై అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు.క్షేత్రస్థాయి ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం సీనియర్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. సీజీఎం పి. సోల్మన్ రాజుకు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, సీజీఎం ఎల్. మహేంద్రనాథ్‌కు అనకాపల్లి, సీజీఎం ఎస్. రాజాబాబుకు పశ్చిమ గోదావరి, సీజీఎం బి. అశోక్ కుమార్‌కు ఏలూరు, సీజీఎం జి. శ్యామ్ బాబుకు విశాఖపట్నం సర్కిళ్ల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.
ప్రజల భద్రతకు ప్రాధాన్యం.. తనిఖీల తర్వాతే విద్యుత్ పునరుద్ధరణ
తుఫాను సమయంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని సీఎండీ స్పష్టం చేశారు. ఈదురుగాలుల తీవ్రత అధికంగా ఉన్నప్పుడు విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన ప్రాంతాల్లో సరఫరాను తాత్కాలికంగా నిలిపివేస్తామని తెలిపారు. గాలుల తీవ్రత తగ్గిన తర్వాత విద్యుత్ లైన్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, లైన్ పెట్రోలింగ్ పూర్తయి భద్రత నిర్ధారించిన అనంతరమే సరఫరాను పునరుద్ధరిస్తామని వివరించారు. ఈ సమయంలో ఏర్పడే విద్యుత్ అంతరాయాలకు వినియోగదారులు సహకరించాలని కోరారు.
తీర ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, లైన్ల పరిస్థితిని ముందుగానే పరిశీలించాలని, విద్యుత్ లైన్లపై పడే ప్రమాదం ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. సబ్‌స్టేషన్లలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థలను సురక్షితంగా పునరుద్ధరించేందుకు అవసరమైన యంత్రాలు, వాహనాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
ఆసుపత్రులు, తాగునీటి సరఫరా వ్యవస్థలు, సమాచార వ్యవస్థలు వంటి అత్యవసర సేవలకు విద్యుత్ సరఫరా కొనసాగించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సీఎండీ తెలిపారు. క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం విధుల్లో ఉంటూ పునరుద్ధరణ పనులు చేపడతారని, ప్రజలు వారికి సహకరించాలని కోరారు.
1912 కాల్ సెంటర్ 24 గంటలూ అందుబాటులో
విద్యుత్ సంబంధిత ఫిర్యాదులను వేగంగా స్వీకరించి పరిష్కరించేందుకు 1912 కాల్ సెంటర్‌ను అదనపు సిబ్బందితో బలోపేతం చేశారు. 12 గంటల షిఫ్టుల విధానంలో 24 గంటలూ సేవలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు సీఎండీ తెలిపారు. విద్యుత్ సరఫరా అంతరాయాలు, తెగిపడిన విద్యుత్ తీగలు, దెబ్బతిన్న స్తంభాలు లేదా ఇతర విద్యుత్ సమస్యలు ఎదురైతే వెంటనే 1912కు ఫోన్ చేసి సమాచారం అందించాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. తెగిపడిన విద్యుత్ తీగలను తాకకుండా, వాటికి దూరంగా ఉండాలని సూచించారు.తుఫాను ప్రభావం తగ్గిన వెంటనే భద్రతా ప్రమాణాలను పాటిస్తూ విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు ఏపీఈపీడీసీఎల్ సమన్వయంతో పనిచేస్తుందని సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ తెలిపారు.