ఎన్నికల నియమావళి, అర్ణబ్ తుఫాన్ పై గ్రామాల్లో అవగాహన.
అనకాపల్లి, అక్టోబర్ 26, మేజర్ న్యూస్: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు, అనకాపల్లి సబ్-డివిజన్ డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు సూచనలతో అనకాపల్లి రూరల్ పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమం సోమవారం రాత్రి చేపట్టారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అనకాపల్లి మండలంలోని దిబ్బపాలెం, వూడేరు, మాకవరం గ్రామాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎన్నికలపై పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు. యువత, గ్రామస్తులు సత్ప్రవర్తనతో మెలగాలి, గొడవలు, వర్గ విభేదాలకు దూరంగా ఉండాలి. ఎన్నికల సమయంలో జరిగే గొడవలపై కఠిన చర్యలు - నిందితులపై రౌడీషీట్లు, బైండ్ ఓవర్. వాట్సాప్ గ్రూపుల్లో అవాస్తవాలు ప్రచారం చేసి గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు. ఎన్నికల కేసుల్లో ఇరుక్కుంటే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల క్యారెక్టర్ సర్టిఫికెట్ విషయంలో ఇబ్బందులు, జీవితాలు నాశనమవుతాయి. బైండ్ ఓవర్ పై సంతకాలు చేసిన వ్యక్తులు అల్లర్లు సృష్టిస్తే లక్ష రూపాయల జరిమానా మరియు చట్టపరమైన చర్యలు.
అర్ణబ్ తుఫాన్ పై అప్రమత్తత అవసరం. వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలి. బలహీనమైన ఇళ్లు, పాత భవనాలు, చెట్ల కింద ఉండరాదు, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి. అసత్య వార్తలు, పుకార్లను నమ్మవద్దు, తప్పుడు ప్రచారం చేయవద్దు. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. చెట్లు, కరెంటు స్తంభాలు పడి రోడ్లు బ్లాక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి 3-4 రోజులకు సరిపడా నిత్యవసర సరుకులు ముందే సమకూర్చుకోవాలి. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, పిల్లలకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి. డెలివరీ దగ్గరగా ఉన్న గర్భిణీలను ముందుగానే హాస్పిటల్ లో చేర్పించాలి. లోతట్టు ప్రాంతాలు, పూరి గుడిసెల్లో ఉండే వారు పోలీసు, రెవెన్యూ అధికారులకు సహకరించి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి. ఈ కార్యక్రమంలో అనకాపల్లి రూరల్ సీఐ జి. అశోక్ కుమార్, ఎస్ఐ జి. రవి కుమార్, హెడ్ కానిస్టేబుల్ జి. శ్రీనివాస్, కానిస్టేబుల్ వెంకటేష్ పాల్గొన్నారు.