అర్నాబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండండి! : కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం, మేజర్ న్యూస్ : అర్నాబ్ తుపాను ప్రభావంతో కృష్ణా జిల్లాలో ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం నుంచి 28వ తేదీ వరకు భారీ వర్షాలు, గంటకు 115 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 27, 28 తేదీల్లో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించినట్లు వెల్లడించారు. ఈ రెండు రోజుల్లో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించవద్దని, చెట్ల కింద నిలబడకూడదని సూచించారు.
273 పునరావాస కేంద్రాలు సిద్ధం
జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, ముంపు ప్రభావిత ప్రాంతాలు, కచ్చా ఇళ్లలో నివసించే ప్రజల కోసం 273 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అధికారులు ముందస్తుగా తరలివెళ్లాలని సూచించిన వెంటనే ప్రజలు ఆలస్యం చేయకుండా పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. తుపాను సమయంలో నిర్లక్ష్యం ప్రాణాపాయానికి దారితీస్తుందని హెచ్చరించారు.
విద్యుత్, రహదారుల పునరుద్ధరణకు ప్రత్యేక ఏర్పాట్లు
బలమైన గాలులకు చెట్లు కూలి రహదారులకు అంతరాయం కలగకుండా తొలగింపు బృందాలను ఏర్పాటు చేశామని, పవర్ సా యంత్రాలు, జేసీబీలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. విద్యుత్ స్తంభాలు కూలడం, సరఫరాలో అంతరాయాలు ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సబ్‌స్టేషన్ల వద్ద అవసరమైన సామగ్రి, సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు వివరించారు. రహదారులపై వరద నీరు ప్రవహిస్తున్నప్పుడు దాటేందుకు ప్రయత్నించవద్దని, హెచ్చరిక బోర్డులను గమనించాలని సూచించారు.
అత్యవసర సహాయం కోసం సంప్రదించండి
తుపాను పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు జిల్లా, డివిజన్ స్థాయిలో నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ నియంత్రణ కేంద్రం 08672-252399, మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయం 08672-252486, ఉయ్యూరు ఆర్డీవో కార్యాలయం 08676-232589, గుడివాడ ఆర్డీవో కార్యాలయం 08674-243698 నంబర్లకు ఫోన్ చేసి అత్యవసర సమాచారం, సహాయం పొందవచ్చని వెల్లడించారు. ప్రతి మండల తహసీల్దార్ కార్యాలయంలోనూ నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. తుపాను ఎక్కడ తీరం దాటుతుందనే అంశంపై స్పష్టత లేనప్పటికీ, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అప్రమత్తంగా ఉంటూ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ డీకే బాలాజీ విజ్ఞప్తి చేశారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.