ఎన్నికల ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ కీలక సూచనలు
అరకులోయ,అక్టోబర్ 26, మేజర్ న్యూస్:స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు మండల స్థాయి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు,ఎన్నికల సహాయ అధికారులకు పాడేరు సబ్ కలెక్టర కె. సాహిత్ పలు కీలక సూచనలు చేశారు. నియోజకవర్గం పరిధిలోనిఅరకులోయ,డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల్లో ఆయన సోమవారం విస్తృతంగా పర్యటించి ఎన్నికల స్ట్రాంగ్ రూమ్‌లు, పోలింగ్ కేంద్రాలు,సీసీ కెమెరాల ఏర్పాట్లను పరిశీలించారు.త్వరలో జరగనున్న జెడ్పిటిసి, ఎంపీటీసీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు.ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో చేపడుతున్న ఏర్పాట్లను తనిఖీ చేయడంతో పాటు ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా,సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు ముందస్తుగా చేపట్టాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సబ్ కలెక్టర్ సూచించారు. ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా,భద్రతతో జరగాలని స్పష్టం చేశారు. ఓటింగ్ యంత్రాల బ్యాలెట్ పెట్టెల (బాక్స్ )ల భద్రత కోసం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతా ప్రమాణాలను తనిఖీలు చేసి 24 గంటలు పటిష్టమైన నిఘా ఉండేలా సీసీ కెమెరాల కవరేజ్ పక్కాగా ఉండాలని సంబంధిత మండల ప్రత్యేక అధికారి,ఎన్నికల రిటర్నింగ్ అధికారులు,సిబ్బందికి ఆయన ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్అధికారి ఎం. శ్రీధర్,ఎన్నికల సహాయాధికారులు వీసం. ప్రసాద్,జి.రాజా శ్రీధర్,స్ట్రాంగ్ రూమ్ ఇంచార్జిలు రెవిన్యూ,ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.