శాంతియుత ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలి - డీఎస్పీ విద్య.
అనపర్తి, మేజర్ న్యూస్:స్థానిక సంస్థల ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరూ సహకరించాలని డీఎస్పీ బి. విద్య కోరారు. ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తితో వ్యవహరించాలని సూచించారు.అనపర్తి మండలంలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో అభ్యర్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ బి. విద్య, సీఐ సుమంత్, ఎస్సై వినయ్ ప్రతాప్, ఎస్సై సుజాత పాల్గొని ఎన్నికల సమయంలో పాటించాల్సిన నిబంధనలపై పలు సూచనలు చేశారు.
ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు, వారి అనుచరులు సంయమనం పాటించాలని, ప్రత్యర్థి పార్టీల నాయకులు, కార్యకర్తల పట్ల గౌరవభావంతో వ్యవహరించాలని పోలీసులు సూచించారు. ప్రచార కార్యక్రమాల్లో ఘర్షణలకు తావివ్వకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు.
ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, బెదిరించడం, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడకూడదని స్పష్టం చేశారు.రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, అవసరమైన అనుమతులు తీసుకుని నిబంధనలను పాటించాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించడం పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని డీఎస్పీ బి. విద్య పేర్కొన్నారు. ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకమని, వాటిని సజావుగా నిర్వహించడంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు సమష్టి బాధ్యతతో వ్యవహరించాలని పోలీసు అధికారులు పిలుపునిచ్చారు.