బషీరాబాద్, మేజర్ న్యూస్ : పోలీస్ శాఖలో ఫోటోగ్రఫీ నైపుణ్యాలను మెరుగుపరచడంతో పాటు వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ప్రత్యేక శిక్షణను తెలంగాణ పోలీస్ అకాడమీ (టీజీపీఏ)కు చెందిన ముగ్గురు సిబ్బంది విజయవంతంగా పూర్తి చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి టీజీపీఏ డైరెక్టర్ అభిలాష బిస్త్ ఐపీఎస్ చేతుల మీదుగా కోర్సు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా బషీరాబాద్ వాసికి ఈ శిక్షణలో భాగస్వామ్యం కావడం గౌరవంగా నిలిచింది.టీజీపీఏ డీడీ అడ్మిన్ ఎస్పీ కేఆర్‌కే ప్రసాద్‌రావు చొరవతో శామీర్‌పేటలోని మైక్ అకాడమీలో ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ విధుల్లో ఫోటోగ్రఫీ ప్రాధాన్యతను గుర్తించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వృత్తిపరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసి సర్టిఫికెట్లు అందుకున్న వారిలో ప్రవీణ్ కుమార్, రాజశేఖర్, మణి ఉన్నారు. శిక్షణ ద్వారా ఫోటోగ్రఫీలో ఆధునిక పద్ధతులు, సాంకేతిక అంశాలపై అవగాహన పెంపొందించుకున్నామని వారు తెలిపారు. తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు అవకాశం కల్పించిన టీజీపీఏ డైరెక్టర్ అభిలాష బిస్త్, డీడీ అడ్మిన్ ఎస్పీ కేఆర్‌కే ప్రసాద్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీజీపీఏ సైబర్ సెక్యూరిటీ నిపుణులు ప్రగతి రతన్, మైక్ అకాడమీ ప్రతినిధులు హేమంత్, ప్రద్యుమ్న, ఉషశ్రీ సలాడి తదితరులు పాల్గొన్నారు.