పొదిచన్‌పల్లి తండా సమీపంలో పసికందు కలకలం
మెదక్: పాపన్నపేట మండలం పొదిచన్‌పల్లి తండా సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే జన్మించిన మగ శిశువును వదిలివెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయంపై జిల్లా బాలల సంరక్షణ విభాగానికి సమాచారం అందడంతో శిశు సంక్షేమ శాఖ అధికారులు వెంటనే స్పందించారు.సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని శిశువును రక్షించారు. అనంతరం ప్రాథమిక వైద్య చికిత్స నిమిత్తం మెదక్‌లోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శిశువుకు చికిత్స అందించారు.ఈ ఘటనకు సంబంధించి అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైద్యుల సలహా మేరకు శిశువుకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు.శిశువు ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, శిశువును వదిలివెళ్లిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.