పుర పోరులో ఎన్డీఏ కూటమిదే విజయం
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి వాసంశెట్టి సుభాష్
రామచంద్రపురం, మేజర్ న్యూస్, రామచంద్రపురం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆయన తండ్రి, కూటమిపార్టీ సీనియర్ నేత వాసంశెట్టి సత్యం ఆదివారం తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిపి పట్టణంలోని రత్నంపేట శ్రీ బాలగంగాధర్ తిలక్ ఎంపి ఎల్ ప్రైమరీ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ అన్ని పోలింగ్ కేంద్రాల్లో జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసిందని, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం తమ పార్టీ అభ్యర్థుల విజయానికి దోహద పడుతుందన్నారు.రామచంద్రపురం మున్సిపాలిటీలో చైర్మన్ అభ్యర్థితో పాటు మొత్తం 32 వార్డుల్లో కూటమి పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 35,728 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని,వీరిలో 18,540 మంది మహిళలు, 17,188 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 50 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. పట్టణవ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు.
న్యాయం గెలుస్తుంది..అభివృద్ధి గెలుస్తుంది.. సంక్షేమం గెలుస్తుంది.. కూటమి ఐక్యత గెలుస్తుంది..అని మంత్రి సుభాష్ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమి ఐక్యమత్యంతో స్థానిక ఎన్నికలను ఎదుర్కొంటున్నామని వెల్లడించారు. వ్యక్తులు ముఖ్యం కాదు.. పార్టీయే ముఖ్యం.. పట్టణంలో గడి గోవింద్ అనే కార్యకర్తతో పాటు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన కార్యకర్తలను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి సుభాష్ ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో మాదిరి 94% స్ట్రైక్ రేట్ దాటి విజయం సాధిస్తామని గేమ్ ఆ వ్యక్తం చేశారు. కూటమి సీనియర్ నేత వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ పట్టణంలో మొత్తం 32 వార్డులు క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విలువలకు కట్టుబడి అంతా ఐక్యంతో పని చేశామని, ఎన్డీఏ కూటమి పట్ల ప్రజల్లో మంచి స్పందన లభిస్తుందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు తదితరులు పాల్గొన్నారు.