యుద్ధాలు లేని సమాజ నిర్మాణమే ప్రపంచశాంతికి మార్గం
ప్రపంచ శాంతి, మానవ హక్కుల పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలి
ఎల్బీనగర్, మేజర్ న్యూస్ ప్రతినిధి : ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు, అశాంతి నెలకొన్న నేపథ్యంలో యుద్ధాలు లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి, మానవ హక్కుల పరిరక్షణ, దేశాల సార్వభౌమాధికారానికి గౌరవం, ప్రజాస్వామ్య, లౌకిక విలువల రక్షణ కోసం ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని కోరారు.
అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం రంగారెడ్డి జిల్లా నాలుగో మహాసభ ఆదివారం టీఎన్జీవో భవన్‌లో తిప్పర్తి మహేష్, పల్లె వినయ్ అధ్యక్షతన జరిగింది. మహాసభను ప్రారంభించిన రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్ మాట్లాడుతూ యుద్ధోన్మాదం, సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఉద్యమిస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సెక్యులర్ విలువల పరిరక్షణతోనే సమాజ అభివృద్ధి సాధ్యమన్నారు.
సంఘం అధ్యక్ష మండలి సభ్యుడు బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ మానవ హక్కులు, దేశాల సార్వభౌమాధికార పరిరక్షణకు ప్రపంచ ప్రజలు ఐక్యంగా పోరాడాలని కోరారు. మరో సభ్యుడు తిప్పర్తి యాదయ్య మాట్లాడుతూ, రాజకీయ భేదాలకు అతీతంగా శాంతి కోసం ప్రజలంతా ఒక్కటిగా నిలవాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ సమత మాట్లాడుతూ కులమతాల పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మానవతా విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా మహాసభల పథకాన్ని తిప్పర్తి యాదయ్య ఆవిష్కరించారు. కార్యక్రమంలో పల్లె వినయ్, పోలగాని రవికిషోర్, పల్లె నరసింహ, వి. గణేష్, కలకొండ కాంతయ్య, పాండురంగాచారి, ఇరుగు శ్రీధర్, పల్లె వెంకన్న, చిత్రం సైదులు, శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.