telangana
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి
వికారాబాద్, మేజర్ న్యూస్:పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసి, ఆత్మగౌరవంతో కూడిన జీవనాన్ని అందించడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు అనంతగిరిపల్లి లక్ష్మీనగర్ కాలనీలో నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన గృహంలోకి అడుగుపెడుతున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆశయంతో, తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో, మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య సహకారంతో అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతున్నాయని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న నిరుపేదల కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందని పేర్కొన్నారు.పేదవాడికి సొంత ఇల్లు అనేది కేవలం నివాసం మాత్రమే కాదని, అది ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వికారాబాద్ పట్టణంలో అర్హులైన ఒక్క కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఉండకూడదనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నూతన గృహాల్లో కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో 25వ వార్డు కౌన్సిలర్ వినోద్ కుమార్, శ్రీకాంత్, స్థానిక నాయకులు, వార్డు ప్రజలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.