శ్రీవారి ఆలయంలో నేడు కైశికద్వాదశి ఆస్థానం..మాడవీధుల్లో ఊరేగనున్న ఉగ్రశ్రీనివాసమూర్తి
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం (నవంబరు 21) సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏడాది మొత్తంలో ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్రశ్రీనివాసమూర్తిని (వేంకటతురైవార్) ఆలయ మాడవీధులలో ఊరేగించడం ఇక్కడి విశేషం.
ఉత్సవ వేళలు ఇలా..
శనివారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి 5.45 గంటల వరకు, సూర్యోదయానికి ముందే ఉగ్రశ్రీనివాసమూర్తిని ఉభయ నాంచారులతో కలిసి తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు ఆలయంలోని బంగారు వాకిలి చెంత కైశిక ద్వాదశి ఆస్థానాన్ని పురాణ పారాయణంతో శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
సూర్యోదయానికి ముందే ఎందుకు?
14వ శతాబ్దంలో ఉగ్రశ్రీనివాసమూర్తిని ఊరేగిస్తున్న సమయంలో సూర్యకిరణాలు స్వామివారి విగ్రహంపై పడటంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అప్పటి నుంచి సూర్యోదయానికి ముందే స్వామివారి ఊరేగింపును పూర్తి చేయడం ఆనవాయితీగా వస్తోంది.
కైశికద్వాదశి ప్రాశస్త్యం
ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్లిన శ్రీమహావిష్ణువును మేల్కొలిపే పర్వదినమే కైశిక ద్వాదశి. దీనిని ప్రబోధనోత్సవం, ఉత్తాన ద్వాదశి అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం.. శ్రీ నంబదువాన్ (సత్యమూర్తి) అనే భక్తుడు కైశిక రాగంలో స్వామివారిని కీర్తించేందుకు వెళ్తుండగా ఒక బ్రహ్మరాక్షసుడు అడ్డుకున్నాడు. స్వామివారికి సంకీర్తనార్చన పూర్తి చేసి తిరిగి వచ్చి నీ ఆకలి తీరుస్తానని నంబదువాన్ ప్రమాణం చేశాడు. ఇచ్చిన మాట ప్రకారం తిరిగి వచ్చిన ఆయన సత్యనిరతికి, భక్తికి మెచ్చిన స్వామివారు నంబదువాన్‌కు మోక్షం ప్రసాదించారు. ఈ కథతో ఈ పర్వదినానికి కైశిక ద్వాదశిగా పేరు స్థిరపడింది.