ఒక్కరోజు ఆమె పాత్రలో.. మహిళల కష్టాలకు సెల్యూట్!
చౌటుప్పల్, మేజర్ న్యూస్: అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గుండేబోయిన రమేష్ యాదవ్ మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న కష్టాలు, బాధ్యతలను ప్రత్యేకంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు కుటుంబం కోసం ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఎన్నో పనులు చేస్తూ నిరంతరం శ్రమిస్తారని తెలిపారు.
ఇంటి పనులు, వంటావార్పు, పిల్లల సంరక్షణ, కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడం, ఇంటి నిర్వహణ వంటి బాధ్యతలను మహిళలు ఎంతో ఓర్పుతో నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. ఉద్యోగం చేసే మహిళలు ఇంటి బాధ్యతలతో పాటు వృత్తిపరమైన బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వహిస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని వివరించారు.
పురుషుల దినోత్సవం సందర్భంగా తాను ఒక్కరోజు మహిళలు ప్రతిరోజూ చేసే పనులు, బాధ్యతలను స్వయంగా చేపట్టినప్పుడు వారి శ్రమ, ఓర్పు, సహనం ఎంత గొప్పవో అర్థమైందని అన్నారు. మహిళలు చేసే పనులను తేలికగా తీసుకోకూడదని, ప్రతి పని వెనుక ఎంతో శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి దాగి ఉంటాయని తెలిపారు.
కుటుంబంలో మహిళల బాధ్యతలను పురుషులు కూడా పంచుకోవాలని, వారి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలని సూచించారు. మహిళల ఆరోగ్యం, విశ్రాంతి, ఆనందానికి కుటుంబ సభ్యులు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మహిళల శ్రమను గుర్తించడం ఒక్కరోజుకే పరిమితం కాకుండా ప్రతిరోజూ వారిని గౌరవించాలని అన్నారు.
మహిళల బాధ్యతలను పంచుకోవడం, వారి శ్రమకు తగిన గుర్తింపు ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత. సమానత్వం, పరస్పర గౌరవంతోనే సంతోషకరమైన కుటుంబం, ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని డాక్టర్ గుండబోయిన రమేష్ యాదవ్ పేర్కొన్నారు